హైదరాబాద్: ఇటీవలి కాలంలో వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు పరస్పరం ప్రశంసించుకోవటం, దానిని ప్రతిపక్షాల నాయకులు ఎద్దేవా చేయటం తరచూ జరుగుతున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఇవాళ కూడా అది పునరావృతమైంది. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ కలిసి విశాఖపట్నంలో నిర్వహిస్తున్న మూడురోజుల పార్టనర్షిప్ సమ్మిట్ వేదికగా మారింది. పార్టనర్షిప్ సమ్మిట్‌లో ఇవాళ సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్-విజన్ 2029 అనే అంశంపై చర్చ జరుగుతోంది. వెంకయ్య నాయుడు మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు గుప్పించారు. తనదైన శైలిలో అంత్యప్రాసలతో మాట్లాడుతూ, చంద్రబాబు ఓ విజనరీ, ఓ మిషనరీ అన్నారు. చంద్రబాబు మంచి పెర్ఫార్మర్, మంచి రిఫార్మర్ అని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ బ్రాండ్ అయితే ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ లేకపోయినా ఫరవాలేదని, చంద్రబాబే ఓ బ్రాండ్ అన్నారు. హైదరాబాద్‌కు ఈ బ్రాండ్ వేల్యూ రావటానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు ఏపీలో ఉన్నాడన్న విషయం మరవొద్దని చెప్పారు. ఏపీకి పెట్టుబడుల విషయంలో సహకరిస్తామని చెప్పారు. ప్రజలు వాస్తవ పరిస్థితులు గమనిస్తున్నారని అన్నారు.ఏపీకి 1.93 లక్షల ఇళ్ళు మంజూరు చేశామని తెలిపారు. ఏపీలో 28 పట్టణాలను అమృత్ పథకం కిందకు తీసుకొచ్చామని, ఒక నగరాన్ని హెరిటేజ్ సిటీగా చేశామని చెప్పారు.
విశాఖపట్నం గురించి మాట్లాడుతూ ఇది సుందరమైన నగరమని వెంకయ్య నాయుడు అన్నారు. ఇక్కడ ఎన్నో అవకాశాలున్నాయని, ఇక్కడి ప్రజలు ఎంతో మంచివారని చెప్పారు. రోజంతా పనిచేసి సాయంత్రం అలా బీచ్‌కు వెళితే కష్టం మర్చిపోవచ్చని అన్నారు. తాను ఇక్కడే చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. నాలుగేళ్ళు ఇక్కడ చదువుకున్నానని, ఇక్కడే జైలు జీవితం అనుభవించానని అన్నారు. తాను ఇక్కడ వెళ్ళినా ఇది తన రాష్ట్రమని వెంకయ్య నాయుడు చెప్పారు.