ప్రస్తుతం మనకున్న రాజకీయ నాయకుల్లో ప్రాసలతో కూడిన చతుర సంభాషణలు నింపి.. తన ప్రసంగాల్లో ప్రజలను ఆకట్టుకోగలిగిన మాటల మరాఠీల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మామూలుగా అయితే.. సామెతలు, తెలుగు, ఇంగ్లిషు, ఉర్దూ భాషలు అన్నీ సమానమైన అధికారంతో కలగలిపి ఆకట్టుకోవడం కేసీఆర్ విద్య అయితే.. తను హాజరయ్యే సభావేదిక సందర్భాన్ని, అవసరాన్ని బట్టి కొన్ని గారడీ మాటలు సృష్టించి.. వాటిలో చతురత నిండిన గిమ్మిక్కులతో, కొత్తగా తాను తయారుచేయడంలో వెంకయ్యనాయుడు దిట్ట. ఇదే విషయాన్ని ఆయనతో ఎవరైనా ప్రస్తావిస్తే మాత్రం.. తన మాటల్లో పంచ్లేమీ ఉండవని, తన ఒంటిమీద మాత్రం ఒకటే పంచె ఉంటుందని.. అందులో కూడా పంచ్ వేస్తూ మాట్లాడగల చతురుడు ఆయన.
ఎలాంటి సమావేశానికి వెళ్లినా.. దానికి తగినట్లుగా కొన్ని అబ్రివేషన్లు, కొత్త సమాసాలు తయారుచేసుకుని వెళ్లడం ఆయన విద్య. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల బాధ్యతను కూడా పాపం.. వెంకయ్యనాయుడు మోస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఎటూ అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా తమిళనాడు ఫలితాల మీద ఎలాంటి ఆశ లేకుండా భాజపా మొక్కుబడిగా ఇక్కడి ఎన్నికల గోదాలోకి దిగుతోంది. అయితే.. ఎవరో ఒకరు పాపాలభైరవుడిలా భారం మోయాలి గనుక.. అది వెంకయ్య వంతు అయింది. అయితే ఆయన మాత్రం చాలా సీరియస్‌గా.. భాజపాకు అధికారం కట్టబెట్టేయండి.. అంటూ జనంలోకి దూసుకెళ్తున్నారు.
ఆయన మార్కు మాటలగారడీ ముద్ర ఉన్న కొత్త నినాదం ఏంటంటే.. ‘అయ్య పాలన, అమ్మ పాలన చూశారు.. భయ్యా పాలన కూడా ఒకసారి చూడండి’ అనేది. అంటే ఆయన ఉద్దేశం అయ్య- కరుణానిధి, అమ్మ- జయలలిత పాలనలను ప్రజలు చూశారు. భయ్యా- మోడీ పరిపాలన ఎలా ఉంటుందో రుచిచూడండి అని ప్రజలను రిథమిక్‌గా ట్యూనింగ్ చేస్తున్నారన్నమాట. ఇలాంటి బురిడీలకు తమిళ ప్రజలు పడిపోతారో లేదో తెలియదు. అయితే.. ద్రవిడ పార్టీలకు అంతం చెప్పండి అంటూ వెంకయ్య చేసే నినాదాలు పార్టీకి చేటు చేస్తాయని భాజపా వారంటున్నారు. తమిళ ప్రజలు యావత్తూ.. తమను తాము ద్రవిడులుగానే గుర్తించుకునే సమయంలో.. ద్రవిడ పదం వాడి.. ఆ పార్టీలకు పాతర వేయమని కోరితే.. భాజపాకు పుట్టగతులుండవని అంటున్నారు. వెంకయ్యనాయుడు పాపం.. తమిళనాట చెమటోడ్చి.. భాజపా పరిస్థితిని మరింత దిగజార్చి వస్తారేమోఅని పలువురు విశ్లేషిస్తున్నారు.