”నేనేమీ మీరు వేస్తున్న ఓట్లతో గెలిచి పార్లమెంటుకు వెళ్తున్న ఎంపీని కాను.. మీకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం నాకు లేదు” అనే అర్థం వచ్చేలా తనదైన నర్మగర్భ వ్యాఖ్యానంతో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అనేక సార్లు చెబుతూ ఉంటారు. నిజమే ఆయన కేవలం పార్టీ అధినేతలను ప్రసన్నం చేసుకోవడం ద్వారా పార్టీ ఏదో ఒక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఉంటే.. అలా అలా ఎంపీగా కొనసాగుతూ వస్తున్న వ్యక్తి. అయితే ప్రస్తుతం ఆయన పదవీకాలం ముగిసిపోతుండగా, ఈ దఫా మాత్రం తెలుగుదేశం పార్టీ రాజ్యం చేస్తున్న ఆంధ్రప్రదేశ్ నుంచే ఆయన రాజ్యసభకు ఎంపిక కావాలని వ్యూహరచనలో ఉన్నట్లుగా కొన్ని పుకార్లు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ తమ రాజ్యాంగం ప్రకారం రెండు సార్లు మాత్రమే ఎవరికైనా రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాన్ని ఇస్తుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మరోసారి కూడా అవకాశం ఇస్తారు. అయితే వెంకయ్యకు ఆ పరిమితి పూర్తయిపోయిందనేది పార్టీ వర్గాల సమాచారం. పోయినసారి ఆయన భాజపాకు సీట్ల బలం ఉన్న కర్ణాటక నుంచి రాజ్యసభ ఎంపీగా వెళ్లారు. ఈసారి ఆయనకు మోడీ సర్కారు మరోసారి ఎంపీ అయ్యే అవకాశం తమ భాజపాకు బలం ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన ఆంధ్రప్రదేశ్ మీద కన్నేశారని, ఇక్కడినుంచి తెలుగుదేశం మద్దతుతో ఎంపీగా మరోమారు సభలో కొనసాగేందుకు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వెంకయ్యనాయుడు ప్రజల ఆశలను దారుణంగా వమ్ము చేశారని చెప్పాలి. ఒకప్పట్లో రాజ్యసభ ఎదుటకు విభజన బిల్లు వచ్చినప్పుడు.. ఈ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఐదేళ్లు ఉంటే కుదరదు, పదేళ్లు ఉండాల్సిందే అంటూ వాదించిన ఈ నాయకుడు.. తమ ప్రభుత్వం రాగానే మన్ను తిన్న పాములా ఉండిపోయారు. ఈ రాష్ట్రానికి అసలు హోదా ఇవ్వం అని తిరస్కరిస్తుంటే నోరు మెదపడం లేదు. కేవలం తాను ప్రజల ఎదుటకు వెళ్లవలసిన అవసరం తనకు లేదు.. ప్రజల ఓట్లతో ఎంపీ అయ్యే ఖర్మ తనకు లేదు అనే భరోసాతోనే వెంకయ్యనాయుడు ఇలా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఉంటారనేది జగమెరిగిన సత్యం. అలాంటి మాటల మరాఠీ వెంకయ్యనాయుడు ఏపీలోని తెలుగుదేశం ఎమ్మెల్యేలు తమ ఓట్లతో మళ్లీ రాజ్యసభకు పంపితే గనుక.. వారు కూడా రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేసినట్లే అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. వారు అలా ఓట్లు వేస్తే గనుక.. ప్రజల అభీష్టానికి భిన్నంగా మోసం చేసినట్లు అవుతుందని అంటున్నారు! మరి చంద్రబాబునాయుడు , వెంకయ్యనాయుడు అభ్యర్థిత్వాన్ని బలపరచి కొరివితో తలగోక్కుంటారో ఏమో చూడాలి!