తెలుగు మీడియాలో గుర్తింపు ఉన్న జర్నలిస్టులలో ఒకరు వెంకటకృష్ణ. పలు చానళ్లు మారి.. టీవీ5లో ఉన్నప్పుడు వైఎస్ సపోర్టరుగా.. ఏబీఎన్‌కు వచ్చాక టీడీపీ మద్దతుదారుగా చర్చా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన ఇప్పుడు సొంత వెంచర్ ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ బీజేపీ నేత సపోర్టుతో డిజిటల్ మీడియాను పెట్టేందుకు ఏబీఎన్ కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పటికే యాజమాన్యానికి ఈ విషయం చెప్పారని ఆంధ్రజ్యోతి కాంపౌండ్ లో ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఆయన ఓ సారి ఏబీఎన్ నుంచి బయటకు వెళ్లాలనుకున్నారు. కానీ మళ్లీ మనసు మార్చుకున్నారు. ఇప్పుడు మాత్రం ఇక కొనసాగే అవకాశం లేదని అంటున్నారు. నిజానికి వెంకటకృష్ణ.. ప్రైమ్ టైమ్ లో చర్చా కార్యక్రమాలే నిర్వహిస్తారు కానీ.. చానల్ మొత్తం ఎడిటోరియల్ పాలసీని చూసుకునేవారు. వేమూరి రాధాకృష్ణ ఇటీవలి కాలంలో చానల్ ను అసలు పట్టించుకోవడంలేదని చెబుతున్నారు.
ఇప్పుడు వెంకటకృష్ణ వెళ్లిపోతే మళ్లీ ఆర్కే చానల్ పై దృష్టి పెట్టాల్సి రావొచ్చునని అంటున్నారు. వెంకటకృష్ణ గతంలో కూడా సొంత మీడియా వెంచర్ పెట్టారు. వరంగల్ కు చెందిన వెంకటకృష్ణ.. తొలి ఆంధ్రా చానల్ అని AP24/7 పేరుతో విజయవాడలో చానల్ పెట్టారు. అది ఇన్వెస్టర్ల వివాదాల్లో చిక్కుకుని మూతపడింది. ఇప్పుడు బీజేపీ నేతతో కలిసి డిజిటల్ మీడియాలోకి వస్తున్నారు.