భారత ప్రభుత్వ అటార్నీ జనరల్‌గా ఆర్.వెంకటరమణిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న అత్యంత సీనియర్ లాయర్లలో ఒకరు. ఆయనకు నలభై ఏళ్లకుపైగా అనుభవం ఉంది. రెండు రోజుల కిందట ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పోలవరంపై ఎన్జీటీ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన సమయంలో వాదించాల్సిన అభిషేక్ మను సింఘ్వి రాకపోవడంతో.. వెంటనే మరో లాయర్ ను వాదించడానికి తీసుకొచ్చారు.
ఆయనే ఈ వెంకటరమణి. ఇలాంటి సీనియర్ లాయర్లను ఏపీ ప్రభుత్వం మాట్లాడుకోవడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులే ఆశ్చర్యపోయారు. ఇప్పుడీ సీనియర్ లాయర్ వెంకటరమణి కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అయ్యారు. ఇప్పటి వరకూ కేకే వేణుగోపాల్ ఉన్నారు. ఆయన వయసు 90 ఏళ్లు దాటిపోయింది. ఇక తాను చేయలేనని ఆయన చెప్పేశారు. దీంతో గతంలో అటార్నీగా పని చేసిన ముకుల్ రోహత్గీని అడిగారు. కానీ ఆయన కూడా తన వల్ల కాదని చెప్పేశారు. దీంతో చివరికి కేంద్రం.. వెంకటరమణిని ఎంచుకుంది.
ఢిల్లీలో ఉన్న ఖరీదైన లాయర్లలో ఆయన ఒకరిగా భావిస్తారు. ఒక్క సారి కోర్టు ముందు హాజరైనందుకు రూ. పాతిక లక్షల వరకూ వసూలు చేసే లాయర్లలో ఆయన కూడా ఒకరని చెబుతారు. తమిళనాడుకు చెందిన ఆయన ఢిల్లీలో స్థిరపడ్డారు. అయితే ఆ మాటకు వస్తే జగన్.. తన తరపునకేసుల్ని వాదించడానికి అత్యంత సీనియర్ లాయర్లందర్నీ మాట్లాడుకున్నారు. ముకుల్ రోహత్గీ, సింగ్వి, వెంకటరమణి సహా చాలా మంది ఉన్నారు. అందుకే కేంద్రం ఏ సీనియర్ లాయర్‌ను నియమించుకోవాలనుకున్నా.. జగన్ తరపు లాయర్ ఒకరు ఉండాల్సిందేనని.. ఢిల్లీలో సెటైర్లు పడుతున్నాయి.