ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెడతా అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే, తమకు ఏమాత్రం సంబంధం లేని ఏపీ అంశాలపై అతిగా స్పందిచేస్తున్నారు తెరాస నేతలు. ఆంధ్రాలో బీసీలని ఏకం చేస్తా, తెలుగుదేశం పార్టీని ఓడిస్తా అంటూ తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంత హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, తాజా డాటా చోరీ వ్యవహారం కూడా తెలంగాణ కేంద్రంగా జరుగుతున్నదే. ఆంధ్రాలో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకే తెరాస ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడుతోందంటూ తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. ఇది చాలదు అన్నట్టుగా ఇప్పుడు ఏపీ ఉద్యోగ వర్గాల్లోకి కూడా రాజకీయాలు ప్రవేశించాయా, అక్కడ కూడా కులాల పేరుతో గ్రూపులుగా విడగొట్టడంలో తెర వెనక పాత్ర కొంతమంది పోషిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న ఏపీ ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా కొత్త జేయేసీని ఏర్పాటు చేశారు వెంకట్రామిరెడ్డి. ఈయన ఎవరంటే, సచివాలయంలో ఇరిగేషన్ సెక్షన్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. గతంలో సచివాలయ ఉద్యోగ సంఘాల ఎన్నికల్లో పోటీ చేశారు. ఉప్పులూరి మురళీకృష్ణ ప్యానెల్ కి వ్యతిరేకంగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అయితే, అప్పట్నుంచీ ఆయన ప్రభుత్వంపై కొంత వ్యతిరేక ధోరణిని పెంచుకుంటూ వచ్చారని సచివాలయ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాలపట్ల అసంతృప్తి వ్యక్తం చేయడం, ప్రతిష్టాత్మకం అనుకున్న కార్యక్రమాలపై కూడా కామెంట్స్ చేయడం అనేది ఆయనకో అలవాటుగా మారిపోయిందనేవారూ ఉన్నారు. ఆయన్ని పావుగా వాడుకునే ప్రయత్నాలు మొదలైనట్టు కొంతమంది అనుమానిస్తున్నారు.
గత కొన్నాళ్లుగా కామ్ గా ఉంటూ వస్తున్న వెంకట్రామిరెడ్డి, సరిగ్గా ఎన్నికల సమయంలోనే కొత్త సంఘాన్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందనేదే ప్రశ్న? పొరుగు రాష్ట్రం ఉద్యోగ సంఘాలకు చెందిన కొంతమంది ప్రముఖుల ప్రోత్సాహం ఆయనకి ఉందనే గుసగుసలు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల్లో కుల ప్రాతిపదికన చర్చలను ప్రోత్సహించేవారు తయారయ్యారనీ, ఉద్యోగాలను గ్రూపులుగా విడదీసే ప్రయత్నమేదో బయటి నుంచి ప్రారంభమైందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఉద్యోగుల్లో కులపరమైన భావనలు పెంచే విధంగా… ఒక పద్ధతి ప్రకారమే కుట్ర జరుగుతోందనీ, దీనికి సంబంధించిన వ్యూహాలన్నీ హైదరాబాద్ లోనే తయారౌతున్నాయనే గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి.