కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు అనేది ఉద్యోగుల కల. దాని కోసం.. ఉద్యమాలు చేశారు. అయితే ఇప్పుడీ విషయంలో రాజీపడతామన్న సంకేతాలను… ఉద్యోగుల సంఘం నేత వెంకటరామిరెడ్డి పంపుతున్నారు. సీపీఎస్ రద్దు కోసమంటూ.. కొంత మందితో వెళ్లి ఆయన ముఖ్యమంత్రితో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా… సీసీఎస్ ను ఎప్పటిలోగా రద్దు చేస్తారో ఆయన క్లారిటీ తీసుకోలేదు సరి కదా… సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేసేందుకు జగన్ సిద్ధమని చెప్పారని..ఉద్యోగులకు గిలిగింతలు పెట్టే ప్రయత్నం చేశారు. త్వరలో సీఎస్‌తో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినట్లుగా సంతోషంగా ప్రకటించారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల హామీల్లో అత్యంత కీలకమైనది.. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తిస్తున్న సీపీఎస్‌ను రద్దు చేసి.. పాత పెన్షన్ విధానం తీసుకు రావాలని. .. ఉద్యోగులు ఉద్యమాలు చేశారు. వారికి ఇచ్చిన తాయిలాల్లో భాగంగానే.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని జగన్ ప్రకటించారు. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో కాంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీమ్… సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని తీసుకొస్తానని.. ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికి పదిహేను నెలలు అయింది. నిజానికి తొలి కేబినెట్ భేటీలో సీపీఎస్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ అమల్లోకి రాలేదు. అమల్లోకి తేవడానికంటూ… ఓ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు.
మొదట్లో వారం రోజులు అన్నారు… తర్వాత కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం.. రద్దయిపోయినట్లేనన్నారు.. తర్వాత కమిటీల మీద కమిటీలు వేసి… కాలయాపన చేస్తున్నారు. ఆ కమిటీలు ఏమైపోయాయో తెలియడం లేదు. కానీ.. ఇప్పుడు సీపీఎస్ ఉద్యోగులకు మేలు చేస్తామని చెబితే.. తమ డిమాండ్‌పై వెనక్కి తగ్గడానికి సిద్ధమన్నట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటనలు చేయడం… ఆశ్చర్యకరంగా మారింది.