మల్టీస్టారర్ చిత్రాలకు మంచి ఊపునీ, ఉత్సాహాన్నీ అందించిన సినిమా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’. మహేష్ బాబు, వెంకటేష్ కలిసి నటించిన ఈ చిత్రం సరిగ్గా 11 ఏళ్ల క్రితం విడుదలైంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇంటిల్లిపాదికీ చక్కటి వినోదాన్ని పంచింది. పెద్దోడుగా వెంకీ, చిన్నోడుగా మహేష్ నటన అందరికీ నచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ వస్తే..? ఇదే ప్రశ్న వెంకీని అడిగితే ఆయన వెరైటీ సమాధానం చెప్పారు.
”ఈమధ్య ఓ పోస్టర్ చూశాను. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు 2 కి ఫ్యాన్ మేడ్ పోస్టర్ అది. అందులో నేనూ, మహేష్ చాలా వైల్డ్ గా ఉన్నాం. అదేదో యాక్షన్ సినిమాలా అనిపించింది. చూడగానే సరదాగా అనిపించింది” అన్నారు. బహుశా… సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుని బోయపాటి శ్రీను స్టైల్ లో తీస్తే అలా ఉంటుందేమో? నిజానికి ఫ్యామిలీ స్టోరీస్ ఎప్పుడూ సీక్వెల్స్ గా రాలేదు. తీస్తే.. అదో కొత్త ప్రయోగం అవుతుంది. చిన్నోడు, పెద్దోడు పాత్రల్ని అలానే ఉంచి, మరో పాయింట్ ఎత్తుకొంటే బాగానే ఉంటుంది. మరి ఈ ఆలోచన శ్రీకాంత్ అడ్డాలకు వచ్చిందో లేదో..?