అనుకోని డిజాస్టర్, ఊహించని సూపర్ హిట్టూ రెండూ హీరోల్ని దర్శకుల్ని గందరగోళంలో పడేస్తుంటాయి. తరవాత ఎలాంటి సినిమా చేయాలి? అనే డౌటు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వెంకటేష్ పరిస్థితి ఇదే. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వెంకీ కెరీర్లో ఊహించని విజయం. అప్పటి వరకూ వెంకటేష్ సినిమా రూ.50 కోట్లు దాటిన దాఖలాలు లేవు. అలాంటిది ఏకంగా రూ.300 కోట్ల క్లబ్లో చేరింది. ఇది ఎవరూ ఊహించని విజయం. దాంతో ఇప్పుడు వెంకీ డైలామాలో పడిపోయారు. తరవాత ఎలాంటి సినిమాలు చేయాలి? ఎలాంటి కథలు ఎంచుకోవాలన్న మీమాంశలో వెంకీ ఉన్నారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ విడుదలకు ముందు వెంకటేష్ రెండు కథల్ని ఓకే చేశారు. అందులో ‘సామజవరగమన’ కథారచయిత చెప్పిన లైన్ ఒకటి ఉంది. ఈ కథని ఆల్మోస్ట్ పట్టాలెక్కిపోయింది. కానీ ఇప్పుడు వెంకీ డ్రాప్ అయ్యారని సమాచారం. వెంకీ అట్లూరి కూడా వెంకటేష్ కి ఓ కథ చెప్పారు. దాన్నీ ఆయన పక్కన పెట్టారు. సురేందర్ రెడ్డి ఇప్పుడు వెంకటేష్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నారు. అది యాక్షన్ బ్యాక్ డ్రాప్లో సాగే కథ. దాన్ని కూడా వెంకీ లైట్ తీసుకొన్నారని తెలుస్తోంది. కొత్త దర్శకులతో సినిమాలకు వెంకీ ‘నో’ చెబుతున్నార్ట. కాస్త స్టార్ డమ్ ఉన్న దర్శకులు కావాలని చూస్తున్నారు. యాక్షన్ కథల్ని వెంకీ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టి, ఎంటర్టైనర్లపై దృష్టి పెట్టారని సమాచారం. వెంకీ సినిమా అంటే.. సురేష్ బాబు ప్రమేయం తప్పని సరి. కానీ ఆయన రెండు మూడు సినిమాల్ని పట్టించుకోలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ తరవాత.. మళ్లీ ఆయన వెంకటేష్ సినిమాలకు సంబంధించిన పగ్గాలు చేజిక్కించుకొన్నార్ట. ఇప్పుడు వెంకీ కథల్ని ఆయనే వింటున్నారని తెలుస్తోంది.
సంక్రాంతి సినిమా పవర్ ఏమిటో వెంకీకి స్వయంగా తెలిసొచ్చింది. 2027 సంక్రాంతికి ఆయన అనిల్ రావిపూడితో ఓ సినిమా రంగంలోకి దింపుతారు. 2026 పొంగల్ కీ ఆయన రెడీ అవ్వబోతున్నారు. ఏ దర్శకుడితో సినిమా చేసినా సరే… అది 2026 సంక్రాంతికి వచ్చేలా చూసుకోవాలన్నది ఆయన ప్లాన్.