తెలుగులో సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. ఈ సీజన్లో సినిమా విడుదల చేశారంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. అలాగని డిజాస్టర్లు అయిన సినిమాలు కూడా ఉన్నాయనుకోండి. కాకపోతే సంక్రాంతి సినిమాలకు అడ్వాంటేజ్ ఎక్కువ. నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి హీరోగా పేరుంది. తన సినిమాల్లో సంక్రాంతికి వచ్చి హిట్లు కొట్టినవే ఎక్కువ. వెంకటేష్ కు కూడా సంక్రాంతి బాగా కలిసొచ్చింది. చంటి, కలిసుందాం రా, లక్ష్మి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2.. ఇవన్నీ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా పండక్కే విడుదల చేస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సినిమా ఇది. అనిల్ రావిపూడికి ఫ్లాపంటే తెలీదు. పైగా వెంకటేష్‌తో తీసిన ఎఫ్ 2, ఎఫ్ 3 సూపర్ హిట్లు అయ్యాయి. దీంతో ఆయన హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు.
ఈ యేడాది కూడా సంక్రాంతికి వెంకటేష్ నుంచి `సైంధవ్` అనే సినిమా వచ్చింది. అది పెద్ద డిజాస్టర్. ‘సంక్రాంతికి వస్తున్నాం’తో వెంకీ ఈ లెక్క సరిచేస్తాడన్నది అందరి నమ్మకం. ‘సైంధవ్’లో వెంకీ స్టైల్ కనిపించలేదు. వెంకటేష్ నుంచి ఆశించే ఫన్ ఆ సినిమాలో లేదు. పూర్తిగా యాక్షన్ డ్రామా అది. సంక్రాంతికి రావాల్సిన సినిమా కూడా కాదాయె. అందుకే ఎవరూ పట్టించుకోలేదు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ టైటిల్ తోనే పండగ వైబ్ తీసుకొచ్చేశాడు అనిల్ రావిపూడి. ఇద్దరు హీరోయిన్లు, వెంకీ స్టైల్ కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలం. సో.. పండక్కి మిగిలిన సినిమాలకు వెంకీ గట్టిపోటీ ఇవ్వడం ఖాయం.