వెంకటేష్ సినిమా అంటేనే వినోదం గ్యారెంటీ. అలాంటి కథల్ని వండి వార్చడంలో దిట్ట అనిపించుకున్నాడు అనిల్ రావిపూడి. వీరిద్దరికీ వరుణ్‌తేజ్ జత కలిశాడు. ఇక ఆ నవ్వుల ప్రయాణం ఎలా సాగిందో చెప్పక్కర్లెద్దు. దానికి నిదర్శనంగా ఎఫ్ 2 టీజర్ నిలిచింది. దిల్‌రాజు నిర్మించిన చిత్రమిది. తమన్నా, మెహరీన్ కథానాయికలు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కాబోతోంది. వెంకటేష్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ ని విడుదల చేశారు.
పెళ్లికి ముందు – ఆ తరవాత… మగాళ్లు పడే తిప్పల సమాహారం ఈ చిత్రం. పెళ్లికి ముందు ‘పెళ్లాన్ని కంట్రోల్ చేసుకొంటాను.. ‘ అని చెప్పేమగాళ్లంతా. . పెళ్లయ్యాక పెళ్లాల చేతుల్లో ‘కీ’లు బొమ్మలుగా ఎలా మారిపోతున్నారో… ఈ ట్రైలర్లో చూపించారు. వెంకీ ఇలాంటి డైలాగులు చెబితే… ఎలా ఉంటుందో వేరే చెప్పాలా?? ఒక్కసారిగా నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరీ రోజుల్లోకి తీసుకెళ్లిపోయాడు వెంకీ. మరోవైపు వరుణ్ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి.. మెప్పించాడు. ‘తెలంగాణ రాక ముందు.. వచ్చిన తరవాత.. ‘ అని వరుణ్ అంటే.. ‘భయ్యా.. ఎందుకు భయ్యా ఆ గొడవలన్నీ ఇప్పుడు ‘అంటూ వెంకీ చెప్పడం మరింత బాగుంది. టీజర్లోనే చెప్పేసినట్టు… ఈ సంక్రాంతికి బాగా నవ్వించడానికి ఈ తోడల్లుళ్లు సిద్ధమైపోయారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముచ్చటగా ఉంటే, విజువల్‌గా మాత్రం `కొంచెం కలర్ ఎక్కువైన` ఫీలింగ్ కలుగుతోంది. ఈ సంక్రాంతి సినిమాలకు `ఎఫ్ 2` గట్టి పోటీ ఇవ్వడం ఖాయంలా అనిపిస్తోంది.