ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ పెద్ద దెబ్బ కొట్టినా, సంక్రాంతికి వస్తున్నాంతో సేఫ్ అయ్యారు దిల్ రాజు. దాంతో పీడ కలలా మారాల్సిన సంక్రాంతి.. కాస్త హ్యాపీగానే గడిచింది. కాకపోతే…ఈ క్రెడిట్ మాత్రం కచ్చితంగా వెంకటేష్‌కు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఈ సినిమాని ఎట్టిపరిస్థితుల్లోనూ సంక్రాంతికే తీసుకురావాలని గట్టిగా పట్టుపట్టింది వెంకీనే.
గేమ్ చేంజర్‌పై భారీగా పెట్టుబడి పెట్టారు దిల్ రాజు. ఈ సినిమాకు వీలైనంత తక్కువ పోటీ ఉండాలని భావించారు. తన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా గేమ్ చేంజర్‌కు పోటీ రాకూడదని అనుకొన్నారు. వెంకీ, అనిల్ రావిపూడి కాంబో అంటే మినిమం గ్యారెంటీ ఉంటుందని దిల్ రాజుకు తెలుసు. అందుకే సంక్రాంతి హడావుడి అయిపోయిన తరవాత మెల్లగా విడుదల చేద్దామనుకొన్నారు. కానీ వెంకీ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాల్సిందే అని పట్టుపట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయమై దిల్ రాజుతో పలు దఫాలుగా చర్చలు కూడా జరిపారు. ప్రతీ మీటింగ్ లోనూ ‘ఈ సినిమాని సంక్రాంతికి తీసుకురావాల్సిందే’ అని గట్టిగా చెప్పినట్టు టాక్. అయితే దిల్ రాజు ఎప్పుడూ బయటపడలేదని, సరైన సమయం చూసుకొని వెంకీకి నచ్చజెప్పి, ఎలాగైనా వాయిదా వేయించాలని అనుకొన్నార్ట. అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ఫిక్స్ చేసి, మానసికంగా దిల్ రాజుని సన్నద్ధం చేసేశాడు. ఇవన్నీ దిల్ రాజుకి ముందుకు కదలనివ్వకుండా చేశాయి. ‘గేమ్ చేంజర్’కీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకీ 4 రోజుల గ్యాప్ ఉంద కాబట్టి, దిల్ రాజు కూడా కాస్త ధైర్యం చేయగలిగారు. ఒకవేళ ఈ సినిమా సంక్రాంతికి రాకపోతే.. ఈ స్థాయిలో వసూళ్లు చూడడం అసాధ్యం. ఇప్పుడు దిల్ రాజు కూడా అదే రియలైజ్ అయ్యారు. గేమ్ చేంజర్ మూడ్ లో వెంకటేష్ సినిమాని కాస్త వాయిదా వేసినా, ఓ గొప్ప విజయాన్ని చేచేతులా దూరం చేసుకొనేవాళ్లు. ఇప్పుడు వెంకటేష్ పట్టుదలే.. ఈ సినిమాని, దిల్ రాజునీ గట్టెక్కించేసింది.