చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్… వీళ్లంతా ఒక తరం వాళ్లే. ఓ దశలో.. చిత్రసీమకు నాలుగు మూల స్థంభాల్లా నిలిచారు. ఎవరి దారిలో వాళ్లు స్టార్ డమ్ సంపాదించుకున్నారు. అభిమానుల్ని అలరించారు. తమ తరవాతి తరం వచ్చినా.. జోరు చూపించగలిగారు. తమ స్టార్ డమ్ ఇప్పటికీ కాపాడుకుంటూనే వస్తున్నారు. చిరు, బాలయ్య, నాగ్.. ఇప్పుడు సినిమాలతో బిజీ బిజీ. కొత్త కథలు వినడానికీ, ఈతరం దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వెంకటేష్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆయన గత కొంతకాలంగా డల్ అయ్యాడు. ‘గురు’ తరవాత ఒక్క సినిమానీ పట్టాలెక్కించలేదు. రెండు సినిమాలు ఒకే అయ్యాయి. కానీ.. సెట్స్‌పైకి వెళ్లలేదు. నాగచైతన్యతో, వరుణ్‌తేజ్‌తో మల్టీస్టారర్లు ఓకే అయ్యాయి. కానీ.. అవి మల్టీస్టారర్లు అని గుర్తు పెట్టుకోవాలి. చైతూ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేం. ఈ దశలో వెంకీ కొత్త కథలేం వినడం లేదని టాక్. చాలామంది దర్శకులు వెంకీ అప్పాయింట్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. మేనేజర్లకు ఫోన్లు చేసి బతిమాలుకుంటున్నారు. కానీ వెంకీ మాత్రం ‘కథ వినే మూడ్ లేదు’ అని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నాడట.
వెంకీకీ కొత్త సినిమాలు చేసే ఉద్దేశం లేదని, ఆయన ఇప్పుడు రిలాక్సింగ్ స్టేజ్ లో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ‘నాకు సినిమాలు చేసే అవసరం లేదు’ అన్నట్టు వెంకీ ప్రవర్తన ఉందని.. ఆయనకి కథ చెబుదామని ప్రయత్నించీ ప్రయత్నించీ విసిగిపోయినవాళ్లు చెబుతున్నారు. ‘గురు’ అనే కాదు.. అంతకు ముందు వచ్చిన వెంకీ సినిమాలు బాగా నిరాశ పరిచాయి. ట్రెండ్ మారింది. కొత్త కథలు వస్తున్నాయి. వాటికి అనుగుణంగా కథలు అల్లుకోవడంలో వెంకీ విఫలమవుతున్నాడనే చెప్పాలి. మరోవైపు.. ‘వర్కింగ్’ మూడ్‌లోంచి ఆయన కాస్త బయటకు వచ్చినట్టు కనిపిస్తోంది. రెండు మల్టీస్టారర్లలో ఒకటి పట్టాలెక్కి తన షూటింగులతో బిజీ అయ్యేంత వరకూ… వెంకీకి మళ్లీ సినిమాల ధ్యాస రానట్టే ఉంది.