స్టార్ హీరోలు సేఫ్ గేమ్ ఆడాలని భావించడం కొత్తగా అనిపించే విషయమే. ఎందుకంటే స్టార్ హీరోలకుండే మార్కెట్ వేరు. వాళ్లు భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే అనుభవాలు నేర్పిన పాఠాలో.. అతి జాగ్రత్తో తెలీదు గానీ వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్లు ప్రతీ విషయంలోనూ ఆచి తూచి అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు వెంకటేష్ మళ్లీ అలాంటి జాగ్రత్తలే తీసుకొంటున్నాడు. వెంకటేష్ – నయనతార జంటగా నటించిన చిత్రం బాబు బంగారం. జూన్లో విడుదల కావాల్సిన సినిమా ఇది. మెల్లగా జులైకి వెళ్లింది. ఈనెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకొన్నారు. కానీ ఆ ప్రయత్నం నుంచి విరమించుకొన్నట్టు వినికిడి.
ఈనెల 22న కబాలి వస్తోంది. కబాలి బాగుండి.. సూపర్ కలక్షన్లతో నడిస్తే, వారం గ్యాప్ కూడా సరిపోదు. అందుకే 29న రావడం కరెక్ట్ కాదని వెంకీ అండ్ కో భావిస్తున్నారు. ఆగస్టు 12న జనతా గ్యారేజ్ వచ్చేస్తోంది. ఈ రెండింటి మధ్యన పడడం.. రిస్కే. అందుకే జనతా గ్యారేజ్ కూడా వెళ్లిపోయాక తీరిగ్గా వద్దామన్నది వెంకీ ప్లాన్. అందుకే ఇప్పుడు విడుదల తేదీ మార్చడానికే బాబు బంగారం టీమ్ మొగ్గు చూపుతోందని తెలుస్తోంది. ఈనెల 20న విడుదల కావాల్సిన ఆడియో కూడా వాయిదా పడే సూచనలున్నాయని తెలుస్తోంది.