వెంకటేష్, రానా.. వీరిద్దరూ కలిసి ఎప్పుడు నటిస్తారా? అంటూ దగ్గుబాటి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. చిత్రసీమని ఎప్పటి నుంచో ఊరిస్తున్న కాంబినేషన్ ఇది. ఇటీవల రానా కూడా.. `మా ఇద్దరికీ సరిపడ కథ రెడీ అయిపోయింది. త్వరలోనే ఆ వివరాలు చెబుతాం` అని ఓ శుభవార్త వినిపించాడు. అయితే ప్రస్తుతానికైతే…. వెంకీ, రానాలు కలిసి సినిమా చేయడం లేదు. ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. రానాకు దొరికిన కథ కూడా వెబ్ సిరీస్ కి సంబంధించినదే అని తేలింది. అంతర్జాతీయ స్థాయిలో ఓ వెబ్ సిరీస్ చేయాలని రానా ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. అందుకు సంబంధించిన కథలూ వింటున్నాడు. ఎట్టకేలకు ఓ కథని సెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ కథలో… మరో పాత్రకీ కీలకమైన స్థానం ఉండడంతో – ఆ పాత్ర వెంకీ కోసం డిజైన్ చేశారని సమాచారం. దర్శకుడు, ఇతర వివరాలూ తెలియాల్సివుంది.
వెంకీ, రానా వెబ్ సిరీస్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ సినిమా చేస్తే ఇంకా బాగుంటుంది. అయితే… ఈ ఇద్దరు హీరోలూ వెబ్ సిరీస్ తో సరిపెట్టేసేలా ఉన్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయొచ్చు. కానీ.. ఫస్ట్ టైమ్ ఎడ్వాంటేజ్ అనేదిఒకటి ఉంటుంది కదా. ఆల్రెడీ ఈ కాంబోని వెబ్ సిరీస్లో చూసేస్తే.. వెండి తెరపై చూసేటప్పుడు అంత కుతూహలం అనిపించకపోవొచ్చు. ముందు సినిమా చేసి, ఆ తరవాత వెబ్ సిరీస్ చేయడం పర్ఫెక్ట్ ప్లాన్. మరి రానా, సురేష్ బాబు మైండ్ లో ఏముందో? వాళ్లిద్దరూ సినిమా మార్కెట్ ని పూర్తిగా చదివేశారు. కాబట్టి… బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చి ఉంటారు. చూద్దాం.. మున్ముందు ఈ ప్లాన్ ఏమైనా మారుతుందేమో.?!