ఓటీటీ Vs థియేటర్ల పేరుతో నిర్మాతలు, ప్రదర్శన కారుల మధ్య అంతర్యుద్ధమే జరుగుతోంది. సినిమాల్ని ఓటీటీకి అమ్మకండంటూ… ప్రదర్శనకారులు, మరో మార్గం లేదంటూ నిర్మాతలూ వాదులాడుకుంటున్నారు. చిన్న సినిమాలు ఓటీటీకి వెళ్లాయంటే ఓ అర్థముంది. పేరున్న సినిమాలూ ఓటీటీకే ఎందుకు? అన్నది థియేటర్ యజమానుల వాదన. ఓటీటీల వల్ల థియేటర్ వ్యవస్థ కుప్పకూలుతుందని, థియేటర్లపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కార్మికులు రోడ్డున పడతారని ప్రదర్శన కారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోలు సైతం.. ప్రదర్శన కారుల వెంట ఉన్నారు. ఈమధ్య ఓటీటీకి అమ్మేసిన సినిమాల విషయంలో ఇప్పుడు హీరోలు వెనకడుగు వేస్తున్నారని టాక్. అందులో భాగంగా వెంకటేష్ సైతం.. ఎగ్జిబీటర్ల ను సపోర్ట్ చేస్తున్నాడట.
వెంకీ తాజా చిత్రం `నారప్ప` ఓటీటీలో నేరుగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. `నారప్ప` లాంటి పెద్ద సినిమానే ఓటీటీకి వెళ్లిపోతే.. మిగిలిన చిత్రాల మాటేంటి? అన్నది థియేటర్ యజమానుల వాదన. అందుకే ప్రదర్శకారుల కోసం, థియేటర్ల మనుగడ కోసం వెంకీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. `నారప్ప`ని ఓటీటీలో కాకుండా థియేటర్లో విడుదల చేయాలని సురేష్ బాబుకి సూచించాడట. సురేష్ బాబు కూడా ఓటీటీతో చేసుకున్న ఒప్పందాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు టాక్. అయితే.. మరో నిర్మాత థాను మాత్రం థియేటర్లో రిలీజ్ చేయడం వల్ల లాభాలకంటే నష్టాలే ఎక్కువని భయపడుతున్నాడట. ఒకవేళ.. ఈసినిమాని థియేటర్లో విడుదల చేసిన పక్షంలో.. సినిమాకి నష్టాలొస్తే, తాను.. ఆ సొమ్ముని వాపసు చేస్తానని, పారితోషికాన్ని వెనక్కి ఇస్తానని మాట ఇచ్చాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా దాదాపు 30 కోట్లకు ఓటీటీతో బేరం కుదిరింది. థియేటరికల్ రిలీజ్ ద్వారా ఈ సినిమాకి పాతిక కోట్లే వచ్చాయనుకుంటే, ఆ 5 కోట్లూ… వెంకీ వెనక్కి ఇస్తాడన్నమాట. మరి.. దీనికి థాను సరే అంటాడో లేదో చూడాలి.