గౌతమి పుత్ర శాతకర్ణితో దర్శకుడిగా మరో పది మెట్లు ఎక్కేశాడు క్రిష్. అందుకే క్రిష్‌తో సినిమా చేయడానికి బడా స్టార్లు ముందుకు వస్తున్నారు. చిరంజీవితో క్రిష్ కాంబో ఆల్మోస్ట్ సెట్ అయిపోయేదే. కానీ… అందుకు ఇంకాస్త సమయం తీసుకోవాలని అటు చిరు, ఇటు క్రిష్ ఇద్దరూ భావించడంతో ఆ ప్రాజెక్ట్‌కు బ్రేకులు పడ్డాయి. అయితే మరో అగ్ర హీరో వెంకటేష్ క్రిష్‌ని పిలిచి సినిమా చేయమని కోరడం, క్రిష్ ఓ కథ వినిపించడం, దానికి వెంకీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చక చక జరిగిపోయాయి. ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు కూడా ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ సినిమా సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగుతుందని ముందు అంతా అనుకొన్నారు. అయితే ఇది ఓ థ్రిల్లర్ అని చెప్పి షాక్ ఇచ్చాడు క్రిష్. ఇప్పుడు మరో హాట్ న్యూస్ బయటకు వచ్చింది.
అదేంటంటే.. ఈసినిమాలో వెంకీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. డ్యూయల్ రోల్ వెంకీకి కొత్త కాకపోయినా.. ఆ రెండు పాత్రల మధ్య చూపించే వైరుధ్యం మాత్రం కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. ఓ పాత్రలో వెంకీ గెటప్ చూసి అంతా షాక్ అవ్వాల్సిందేనట. ఆ స్థాయిలో దాన్ని డిజైన్ చేశాడట క్రిష్. ఓ పాత్రలో నెగిటీవ్ ఛాయలు కనిపిస్తాయని తెలుస్తోంది. అంటే… హీరో, విలన్ ఇద్దరూ వెంకీనే అన్నమాట. ఈ కొత్తదనం నచ్చే వెంకీ క్రిష్ కథకు ఓకే చెప్పాడని, చాలా తక్కువ రోజుల్లోనే ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నాడని సమాచారం. వెంకీ 75వచిత్రంగా రూపుదిద్దుకోనున్న ఈ ప్రాజెక్ట్ సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనుంది.