కొన్ని సినిమాలంతే మ్యాజిక్ చేసేస్తాయి.
ఏముంది అందులో అనిపిస్తుంది. కానీ.. ఏదో ఉందన్న సంగతి చూశాక అర్థం అవుతుంది. పాటల్లో, మాటల్లో, నటనలో, నడకలో.. ఏదో ఓ మాయ. మొత్తంగా ప్రేక్షకుల్ని కనికట్టు చేసేస్తాయి. `బొబ్బిలి రాజా` కూడా అలాంటి సినిమానే. ఫక్తు కమర్షియల్ సినిమా ఇది. కథా పరంగా మామూలు రివైంజ్ డ్రామా. దానికి అటవీ నేపథ్యం, చక్కటి పాటలు, మాస్ ఎలిమెంట్స్, అన్నింటికంటే ముఖ్యంగా `దివ్య`మైన కథానాయిక అందాలు అన్నీ కలిపి ఓ మాసీ క్లాసిక్ గా నిలిపాయి. ఈరోజుతో బొబ్బిలి రాజాకు 30 ఏళ్లు నిండిపోయాయి.
ధ్రువ నక్షత్రం జరుగుతున్నప్పుడు వెంకటేష్, సురేష్‌బాబు, రామానాయుడు అందర్నీ ఓ చోట కూర్చో బెట్టి `బొబ్బిలి రాజా` కథ చెప్పారు పరుచూరి బ్రదర్స్. వినగానే అందరికీ నచ్చేసింది. దర్శకుడిగా బి.గోపాల్ ఫిక్సయ్యాడు. హీరోయిన్ గా రాధని ఎంపిక చేశారు.
కానీ అంతలోనే ఓ డౌటు. కథలో హీరోయిన్ పాత్ర కాస్త అమాయకంగా ఉంటుంది. అలాంటి పాత్రలకు రాధ సూటవ్వదు అని అనుమానం కలిగింది. రాధ స్థానంలో ఓ కొత్తమ్మాయి అయితే బాగుంటుందన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తం అయ్యింది. డి.రామానాయుడు దగ్గర ఉన్న వందలాది ఫొటోలు కుప్పగా వేస్తే.. అందులోంచి ఓ కథానాయికని ఎంచుకున్నారు. అమెనే.. దివ్యభారతి. అప్పటికి దివ్య భారతి హిందీలో ఓ సినిమా చేస్తోంది. తన నటన ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఆ హిందీ సినిమా రషెష్ తెప్పించుకుని చూశారు. నటన పరంగానూ మార్కులు కొట్టేయడంతో దివ్య భారతిని ఫిక్స్ చేశారు.
కథలో కీలకమైన పాత్ర.. అత్తయ్య పాత్ర. పొగరు, అహంకారం మిళితమై సాగాల్సిన పాత్ర అది. పరుచూరి వాళ్లకు అలాంటి పాత్ర రాసినప్పుడు మైండ్ లో శారద తప్ప మరెవ్వరూ మెదలరు. వాళ్లు కూడా శారదని ఊహించుకునే ఆ పాత్రని డిజైన్ చేశారు. కానీ.. శారద అప్పటికే అలాంటి పాత్రలు చాలా చేసేశారు. వెంకటేష్ తోనూ ఆమెకు కాంబినేషన్ సినిమాలున్నాయి. కాబట్టి.. శారదని పక్కన పెట్లాల్సివచ్చింది. ఆమె స్థానంలోని వాణిశ్రీ వచ్చింది.
స్క్రిప్టు దశలో ఉన్నప్పుడు సురేష్ బాబుకి ఓ అనుమానం వచ్చింది. `బి.గోపాల్ తీసినవన్నీ యాక్షన్ సినిమాలే. తను లవ్ స్టోరీ తీయగలడా` అన్నదే డౌటు. కానీ అప్పటికే ఈ సినిమాపై బి.గోపాల్ చాలా వర్క్ చేశారు. కాబట్టి.. ఆయన్ని తొలగించడం న్యాయం కాదని, డి.రామానాయుడు అడ్డు చెప్పారు. ఈ కథ రాశాక.. దాన్ని ఏ స్టైల్ లో తీయాలి? అన్న చర్చ నడిచింది. అప్పటికే పరుచూరి వెంకటేశ్వరరావు గాడ్ మస్ట్ బీ క్రేజీ చూసి ఉండడం వల్ల – ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలు స్ఫూర్తిగా తీసుకుని సన్నివేశాలు అల్లారు. ఎక్కువ శాతం షూటింగ్ పొలాచ్చీలోనే సాగింది.
నాలుగు రోజులలో సినిమా రిలీజ్ అనగా… ప్రివ్యూ వేసుకుని చూసుకున్నారంతా. అప్పటికి `బలపం పట్టి భామ ఒళ్లో` పాట ఇంట్రవెల్ ముందు వస్తుంది. కానీ.. పరుచూరి గోపాల కృష్ణ మాత్రం `ఆల్బమ్ లోని సూపర్ హిట్ పాట. చివరనే రావాలి` అని పట్టుబట్టడంతో.. ఆ పాటని క్లైమాక్స్‌కి ముందు తీసుకెళ్లి.. క్లైమాక్స్ లోని `చమ్మచక్క` పాటని ఇంట్రవెల్ ముందుకి మార్చారు.
ఈ సినిమాలో ప్రతీ అంశమూ.. కమర్షియల్‌గానే ఉంటుంది. అడవిలో.. దివ్యభారతిని ఫ్యాంట్ లేకుండా చూపించడం – అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా చూశాక చాలామంది పెద్దలు `అమ్మాయిల్ని అర్థనగ్నంగా చూపిస్తే సినిమాలు ఆడేస్తాయా` అని పరుచూరి సోదరుల ముందే వేళాకోళం చూశారు. ఈ సినిమా సక్సెస్ మీట్ లో దాసరి కూడా `దివ్య భారతి వల్లే సినిమా ఆడింది` అని సరదాగా అన్నార్ట. కానీ.. పరుచూరి సోదరులు మాత్రం ఈ మాటని ఒప్పుకోలేదు. సినిమాలో అన్నీ ఉన్నాయ్ కాబట్టే ఆడింది.. ఆర్థనగ్నంగా చూపించినంత మాత్రన.. సినిమాలు ఆడవు… అని దాసరి ముందే వివరణ ఇచ్చేశారు.
అయ్యో.. అయ్యో అయ్యయ్యో మేనరిజం ఇప్పటికీ… వెంకీ అభిమానులు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రాష్ట్రాన్నయినా రాసిస్తా – నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయను అంటూ వాణిశ్రీ చెప్పే డైలాగులు కూడా మార్మోగిపోయాయి. పాటలైతే సరే సరి. `బలపం పట్టి..` పాట మాసీగా ఉన్నా, అందులో ఉన్న సాహిత్య విలువలు గొప్పవి. ఓ సందర్భంలో త్రివిక్రమ్ సైతం ఈ పాట గురించి చాలా గొప్పగా చెప్పడం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. హైదరాబాద్ లో ఏడాది ఆడిన సినిమా ఇది. ఈ సినిమాని రీమేక్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన రానాకి ఉంది. మరి.. ఆ ఆశ, ఆలోచన ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో..?