న్యాయవ్యవస్థపై వైసీపీ నేతలకు ఆ పార్టీ తరపున “సామాజిక” బాధ్యత నిర్వర్తించే ఇతర సంఘాల నేతలకు ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో చెప్పడం కష్టమే. కొంత కాలం ఇలా విమర్శలు చేసి.. సైలెంటయ్యారు. మళ్లీ ఇప్పుడు చెలరేగిపోతున్నారు. ఇటీవల కర్నూలు ఎంపీతో నేరుగా సుప్రీంకోర్టునే తప్పు పట్టేలా వ్యాఖ్యలు చేయించిన వైసీపీ హైకమాండ్ ఈ సారి ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డిని రంగంలోకి దింపింది. అసలు హైకోర్టుతో ఆయనకేమి సంబంధమో కానీ.,. ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తోందని .. న్యాయ వ్యవస్థలోని లోపాలను చర్చించుకోవాల్సిన అవసరం ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఓ ఉద్యోగుల మీటింగ్ ఏర్పాటు చేసిన ఆయన అసలు విషయాల్ని చర్చించకుండా హైకోర్టును తప్పు పడుతూ వ్యాఖ్యలు చేశారు. హైకోర్టులోని కొందరు జడ్జీలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారన్న ఆయన… హైకోర్టు వ్యవహార శైలిపై న్యాయ నిపుణులే విమర్శలు చేశారన్నారు. హైకోర్టు జడ్జీలను దూషించిన కేసులో నిందితులకు 3 నెలలైనా బెయిల్ రాలేదన్నారు. సీఎం జగన్ను గతంలో ఒకరు దూషిస్తే… అతడికి కేవలం గంటలో బెయిల్ ఇచ్చారన్నారు.
జడ్జీలు ప్రభుత్వంపై ఏది పడితే అది మాట్లాడకుండా హుందాగా ఉండాలని కూడా ఆయన హితవు కూడా పలికారు. ఈ సమావేశంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు కాపాడుకోవాలని కూడా ఆయన ఉద్యోగులకు పిలుపునిచ్చారు. న్యాయవ్యవస్థపై అందరూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నా ఎలాంటి చర్యలు తీసుకపోవడంతో సంబంధం లేకపోయినా… రాజకీయ ఎజెండాతో వెంకట్రామిరెడ్డి లాంటి వాళ్లు మాట్లాడేస్తున్నారు. నిందలేస్తూనే ఉన్నారు.