జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఓ కానిస్టేబుల్ తమకు ప్రభుత్వం బకాయిలు పెట్టిందని ఓ పోస్టర్ పట్టుకుని నిరసన తెలిపాడు. అంతే ఆయన ఉద్యోగి ఊడిపోయింది. అందుకోసం ఆయనను వేటాడారు. వ్యక్తిగత జీవితాన్ని బయటకు తీశారు. డిస్మిస్ చేశారు. చివరికి హైకోర్టులో కూడా ఆయనకు ఎలాంటి రిలీఫ్ రాలేదు. కానీ ఇప్పుడు వెంకట్రామిరెడ్డి అనే ఉద్యోగ సంఘం నేత.. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ వైసీపీకి అధికారికంగా పనిచేస్తున్నారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.
ఆయన చేసే రాజకీయాలతో సెక్రటేరియట్ అంతా కలుషితం అవుతోంది. అయినా ఆయనపై చర్యలు తీసుకోవడం లేదు. ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసేంత తప్పులు ఆయన చేసినప్పటికీ ఇంకా ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు. కానీ ఆయన మాత్రం ఆలోచించడం లేదు. నేరుగా వైసీపీకి పని చేస్తున్నారు. తాజాగా ప్రెస్ మీట్ పెట్టి.. ఉద్యోగుల సమస్యలన్నట్లుగా మాట్లాడుతూ వైసీపీ వాయిస్ ను వినిపించారు. పించన్లు తెల్లవారే ఇవ్వకపోతే ఏమవుతుందని ఆయన అంటున్నారు. ఉదయమే వెళ్తే ప్రమాదాలు జరుగుతాయట. ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవారిని ఉద్యోగాల్లోకి ఎందుకు తీసుకుంటారో కానీ.. తప్పులు బయటపడిన తరవాత కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం.
ఆయనను ఉద్యోగం నుంచి తొలగిస్తే.. ఉద్యోగం సంఘం నేత అనే ముసుగుతొలగిపోతుంది. నేరుగా వైసీపీ ఆఫీసు నుంచి పని చేసుకుంటారు. ఆయనకు కావాల్సింది కూడా అదే. అదేదో ప్రభుత్వం చేసి పెట్టవచ్చు . కానీ ఆయనను ప్రభుత్వంలోనే ఉంచి..ఆయన చల్లే బురదను కడుక్కోవడానికే ప్రాధాన్యం ఇస్తోంది.