ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి .. ఎస్ఈసీ నిమ్మగడ్డను చంపే హక్కు కూడా ఉందన్నట్లుగా మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడు తన మాటలు వక్రీకరించారని చెప్పుకోవడానికి మీడియా ముందుకు వచ్చి మరింత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఎన్నికలు నిర్వహించాలన్న విధంగా వచ్చినా… ఎన్నికలు జరగవన్నట్లుగా మాట్లాడుతున్నారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్మీట్ పెట్టిన వెంకట్రామిరెడ్డి… ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సుప్రీం ఎన్నికలు జరపమని తీర్పు ఇచ్చినా నామినేషన్ల ప్రక్రియ జరిగే పరిస్థితి ఉందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికలు జరిగే వాతావరణం లేదని ఆయన తేల్చేశారు. ఎందుకంటే…ఆయన ఉద్దేశం ప్రకారం ఉద్యోగులు ఎవరూ ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి సిద్ధంగా లేరు. సిద్ధంగా ఉన్న ఉద్యోగులతో ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆయన చెబుతున్నారు. వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యల ప్రకారం చూస్తే.. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా ఉద్యోగులు తాము వ్యాక్సినేషన్ అయ్యే వరకూ విధుల్లో పాల్గొనబోమని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఆరు నూరైనా ఎన్నికలు నిర్వహించకూడదనుకుంటున్న ఏపీ సర్కార్.. చివరికి సుప్రీంకోర్టును కూడా ధిక్కరిచేందుకు సిద్ధమవుతోందని.. దానికి ఉద్యోగుల్ని అడ్డం పెట్టుకుంటోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల సమస్యలపై కనీస మాత్రం మాట్లాడటానికి భయపడుతున్న ఉద్యోగ సంఘం నేతలు అధికార పార్టీ కోసం సుప్రీంకోర్టు ఉత్తర్వులు ధిక్కరించడానికి కూడా సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తోంది. పైగా రాజకీయ విమర్శలను కూడా వెంకట్రామిరెడ్డి తక్కువేమీ చేయడం లేదు. ఉద్యోగులను రాజకీయాలకు టీడీపీనే వాడుకుందని.. తనను విమర్శించే టీడీపీ నేతలను అరేయ్ ఒరేయ్ అని పిలువగలనని వార్నింగ్ ఇచ్చారు.