లక్కీ భాస్కర్‌తో మంచి విజయాన్ని అందుకొన్నాడు వెంకీ అట్లూరి. సెకండాఫ్ దగ్గర దొరికిపోతాడు అనే నింద ఈ సినిమాతో చెరిపేసుకొన్నాడు. లక్కీభాస్కర్ తరవాత.. వెంటనే సినిమా పట్టాలెక్కిద్దామనుకొన్నా, సరైన హీరో దొరకడం లేదు. ఇప్పటి వరకూ ఐదుగురు హీరోలకు కథలు చెప్పాడు వెంకీ. నాని, ధనుష్, సూర్య, మోక్షజ్ఞ.. ఇలా కథలు చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు వెంకటేష్ దగ్గర బండి ఆగింది. వెంకటేష్ కు సరిపడా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని రాసుకొచ్చాడు వెంకీ. ఇటీవల కథ కూడా చెప్పేశాడు. వెంకీ గనుక ఓకే అంటే.. సితార ఎంటర్టైన్మెంట్స్లో ఈ సినిమా ఉంటుంది. 2026 సంక్రాంతికి విడుదల చేయాలన్నది ప్లాన్.
అయితే వెంకటేష్ ఇంకా తన తుది నిర్ణయం ప్రకటించలేదు. ప్రస్తుతం `సంక్రాంతికి వస్తున్నాం` విజయాన్ని ఆస్వాదించే పనిలో ఉన్నారు వెంకటేష్. తరువాతి సినిమాపై ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొనే పరిస్థితి కనిపించడం లేదు. కాస్త రిలాక్సయి, అన్ని విధాలా ఆలోచించుకొని, అడుగు వేద్దామనుకొంటున్నారు. వెంకీ అట్లూరితో పాటు కొంతమంది దర్శకులు కథలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఇది వరకు వెంకీ ఓకే చేసిన కథలు కూడా క్యూలో ఉన్నాయి. వీటిలో ఒకటి ఫైనల్ చేయాలి. ఇన్ సైడ్ వర్గాలు మాత్రం వెంకీ అట్లూరి కథ ఓకే అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. చూడాలి… ఏం అవుతుందో?