చిత్రసీమలో సెంటిమెంట్లు ఎక్కువ. తొలి సినిమాతో హిట్టు కొట్టిన దర్శకులు రెండో సినిమాకీ విజయ కేతనం ఎగరవేయడం చాలా అరుదు. దాన్నే ద్వితీయ వీఘ్నం అంటుంటారు. చాలామంది యువ దర్శకుల విషయంలో ఇది నిజమైంది. ఎక్కడో రాజమౌళి, బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి లాంటి దర్శకులు అరుదుగా… ఈ గండం దాటేస్తుంటారు. తాజాగా ఇద్దరు దర్శకులకు ద్వితీయ వీఘ్నం సెంటిమెంట్ ఎదురైంది. వాళ్లే… సంకల్ప్‌రెడ్డి, వెంకీ అట్లూరి.
`ఘాజీ`తో అటు విమర్శకుల ప్రశంసల్ని, ఇటు రివార్డుల్నీ అందుకున్నాడు సంకల్ప్ రెడ్డి. పరిమిత బడ్జెట్‌తో, సరికొత్త కథనంతో తను తెరకెక్కించిన ఘాజీ.. వివిధ భాషల్లో విడుదలై దర్శకుడిగా సంకల్ప్‌కి పేరు తెచ్చిపెట్టింది. రెండో సినిమా `అంతరిక్షం` అన్నప్పుడు ఆ సినిమాపై విపరీతమైన చర్చ జరిగింది. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కిస్తున్న తొలి తెలుగు సినిమా కావడంతో అందరి దృష్టీ అటువైపు పడింది. కానీ.. `అంతరిక్షం` అంచనాల్ని ఏమాత్రం అందుకోలేదు. అటు వసూళ్ల పరంగా డల్‌గా ఉంటే, ఇటు విమర్శకుల్నీ మెప్పించలేకపోయింది.
ఇప్పుడు వెంకీ అట్లూరి వంతు వచ్చింది. `తొలి ప్రేమ`తో ఆకట్టుకున్న యువ దర్శకుడు వెంకీ అట్లూరి. చాలా చిన్న కథని, అందంగా, ప్రభావవంతంగా స్క్రీన్‌పై చూపించాడు. ఎలాంటి అంచనాలూ లేకుండా వచ్చిన ఈసినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దర్శకుడిగా వెంకీకి మంచి అవకాశాలే వచ్చాయి. అఖిల్ ఏరి కోరి… వెంకీని దర్శకుడిగా ఎంచుకుని, తన మూడో సినిమాని పట్టాలెక్కించాడు. అది `మిస్టర్ మజ్ను` రూపంలో విడుదలైంది. తొలిసినిమాలానే.. రొటీన్ కథతో మెప్పిద్దామని ప్రయత్నించి భంగ పడ్డాడు వెంకీ. దాంతో.. అతనకీ ద్వితీయ వీఘ్నం తప్పలేదు.
తొలి సినిమా తీసేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకునే యువ దర్శకులు రెండో సినిమా వచ్చేసరికి రిలాక్స్ అయిపోతారేమో అనిపిస్తుంది. ఓ హిట్టు కొట్టాక స్టార్లు వస్తారు, బడ్జెట్లు పెరుగుతాయి, స్వేచ్ఛ ఎక్కువ అవుతుంది. ఈ భ్రమలో తప్పులు చేస్తుంటారు. తొలి సినిమాతో హిట్టుకొట్టి, రెండో సినిమాకే పరాజయం రుచి చూసిన దర్శకులంతా చేసిన తప్పులే ఇవి. తొలి హిట్టుతో రెండోసారి భారీ అవకాశాలు అందుకున్న చాలా మంది యువ దర్శకుల చిత్రాలు ఇప్పుడు రేసులో ఉన్నాయి. వాటి ఫలితాలు ఎలా ఉంటాయో మరి.