పైరసీ బెడద మామూలుగా లేదు. సినిమా వచ్చిన రోజే హెచ్ డీ ప్రింటుని దింపేస్తున్నారు. అవి ఎక్కడ పడితే అక్కడ యదేచ్ఛగా దర్శనమిస్తున్నాయి. తాజాగా వెంకీ మామాపై కూడా పైరసీ పడగ విప్పింది. ఈ సినిమాని ఏకంగా ఓ ట్రావెల్ బస్సులోనే ప్రదర్శించడం మొదలెట్టారు. ఆ బస్సులో ఉన్న వెంకటేష్ అభిమాని తక్షణం స్పందించి – రంగంలోకి దిగాడు. ఆ ట్రావెల్ ఏజెన్సీపై కేసు పెట్టాడు.
వివరాల్లోకి వెళ్తే.. సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి మైసూర్ వెళ్తోందో ట్రావెల్ బస్సు. అందులో వెంకీ మామ సినిమాని ప్రదర్శించారు. ఆ బస్సులోనే ఉన్న వెంకటేష్ అభిమాని ఒకరు తక్షణం స్పందించి.. ఫోన్లో తన మిత్రులకు సమాచారం అందించారు. ఆ విషయం చిత్రబృందానికీ తెలిసిపోయింది. మార్గమధ్యలో అంటే కర్నూలులో బస్సుని ఆపి ఫ్యాన్స్ నానా గొడవ చేశారు. వెంటనే… కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసుని నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. పైరసీ అనేది ఇప్పుడు చాలా పెద్ద నేరం. పైరసీ సీడీలు అమ్మినా,ప్రదర్శించినా శిక్షకు గురవుతారు. ట్రావెల్ బస్సులో కొత్త సినిమాల్ని యదేచ్ఛగా ప్రదర్శించడం మామూలైపోయింది. ఎవరో ఒకరు.. ఇలా పూనుకుంటే తప్ప పైరసీ ఆగదు.