తెలుగు360 రేటింగ్ : 2.5/5
ఇద్దరు హీరోల ఫార్ములా భలే ఎక్ట్రాక్టీవ్గా ఉంటుంది.
తెరపై హీరోలిద్దరూ నడిచొస్తుంటే – బ్యాక్ గ్రౌండ్ స్కో్ర్ కూడా అవసరం లేకుండా, పూనకాలు వచ్చేస్తాయి.
అది మామా అల్లుళ్ల కథ అయితే…
నిజంగా హీరోలిద్దరూ మామా అల్లుళ్లే అయితే…
ఇంకేం కావాలి?
ఇంకేం చేయాలి?
‘వెంకీ మామ’ కాన్సెప్ట్‌కి ఇక్కడే సురేష్ బాబు పడిపోయి ఉండొచ్చు. వెంకటేష్, నాగచైతన్యలకు సరిపడా సరుకు దొరికిందని సంబరపడిపోయి ఉండొచ్చు.
అయితే ఓ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండడం వేరు.
ఆ కథ ఇద్దరు హీరోల్ని డిమాండ్ చేయడం వేరు.
అక్కడే.. సురేష్‌బాబు, బాబితో పాటు హీరోలిద్దరూ పప్పులో కాలేశారు. దీన్నే బిగ్ మిస్టేక్ అంటారు ఇంగ్లీష్‌లో.
కథ
ఈ కథ గురించి పెద్దగా బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పనిలేదు. ట్రైలర్లలో ఇదే చెప్పారు. ఇంటర్వ్యూలలో ఇదే చెప్పుకొస్తున్నారు. ఓ రకంగా ఇది శ్రీకృష్ణుడు – కంశుడు కథ ఇది. కంసుడి చేవు శ్రీకృష్ణుడి చేతిలో. అది విధి. ఇక్కడ శ్రీకృష్ణుడు నాగ చైతన్య అయితే, కంసుడు వెంకీ బాబు అన్నమాట.
కార్తీక్ (నాగచైతన్య) చిన్నప్పుడే జాతక ప్రభావంతో తల్లిదండ్రుల్ని కోల్పోతాడు. అంతటి దురదృష్టవంతుడు మనకొద్దు అని ఎవరెన్ని చెప్పినా వినిపించుకోకుండా మేనమామ మిలటరీ నాయుడు (వెంకటేష్) మేనల్లుడ్ని చేరదీస్తాడు. అమ్మా – నాన్న అన్నీ తానై పెంచుతాడు. అయితే తన వల్లే.. తన మేనమామకు గండం ఉందని తెలుసుకున్న మేనల్లుడు ఊరు వదిలి వెళ్లిపోతాడు. తన మేనల్లుడు మిలటరీలో ఉన్నాడని తెలుసుకున్న మేనమామ.. అక్కడికి పయనం అవుతాడు. మరి అక్కడ ఏం జరిగింది? మేనల్లుడి గండం ఎలా తప్పింది? ఈ సంగతులన్నీ ‘వెంకీ మామ’ చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
ఈ కథని జానర్థన మహర్షి రాస్తే, కోన వెంకట్, బాబి.. మరో ఇద్దరు స్క్రీన్ ప్లే రైటర్లు కలిసి – రిపేర్లు చేసి `వెంకీ మామా`లా తీర్చిదిద్దారు. ఇంత తీర్చిదిద్దిన తరవాత కూడా కథ ఇలానే రొటీన్ గా ఉందంటే, అంతకు ముందు ఎలా ఉండేదో అర్థం చేసుకోవొచ్చు. జాతక దోషం ఎపిసోడ్‌తో కథని సీరియస్ మోడ్‌లో మొదలెట్టారు. ఈ సినిమా కాన్సెప్ట్ ఇదీ అనే హింట్ ఆదిలోనే ఇచ్చేశారు. ఆ తరవాత పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో కథ మొదలవుతుంది. కాస్త ప్రజెంట్, ఇంకాస్త ఫ్లాష్ బ్యాక్ నేరేషన్‌తో సినిమాని నడిపారు. వెంకీ – నాగచైతన్యల మధ్య బంధాన్ని ఎలివేట్ చేసే సీన్లు బాగానే రాసుకున్నారు. వెంకటేష్ పెళ్లి చూపుల ఎపిసోడ్ ఓకే అనిపిస్తుంది. రాశీఖన్నానీ, పాయల్ని రంగంలోకి దింపాక ‘కన్ఫ్యూజన్’ కామెడీ మొదలవుతుంది. అయితే ఫస్టాప్ అంతా ఈ ట్రాకునే నమ్ముకోవడం మాత్రం బోర్ కొట్టిస్తుంది. చైతూ – పాయల్, వెంకీ – రాశీఖన్నా.. ఈ రెండు ఎపిసోడ్లనీ కన్ఫ్యూజన్ కామెడీతోనే నడిపించేయాలని చూశారు. ఏదో ఓ ట్రాక్‌ని పరిమితమైతే బాగుండేది. రెండు ట్రాకులూ ఒకే కాన్సెప్ట్ అవ్వడంతో దర్శకుడు ఇంతకు మించి ఏమీ ఆలోచించలేడా? అనిపిస్తుంది. హిందీ టీచరు ఇంట్లో ఎపిసోడ్ మాత్రం కాస్త నవ్వులు పంచుతుంది. ఊర్లోవాళ్లు చెంబులు పట్టుకుని పొదల చాటుకి వెళ్తుంటే వాళ్లలోని (ఎ)మోషన్ని క్యాప్చర్ చేయాలని ఆరాటపడే ఎపిసోడ్ నుంచి కామెడీ పుట్టించాలని చూశాడు దర్శకుడు. డబుల్ మీనింగ్ డైలాగులూ వరుస కట్టాయి. కుటుంబమంతా కలిసి చూసేలా ఓ సినిమా చేయబోతున్నాం అని ఫిక్సయినప్పుడు ఇలాంటి ట్రాకుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. కాకపోతే.. అక్కడ వెంకటేష్ లాంటి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు ఉన్నాడు కాబట్టి – కొంతలో కొంత గట్టెక్కగలిగారు.
ద్వితీయార్థం లో ఎమోషన్‌కి పెద్ద పీట వేశారు. ఈ కథలో మిలటరీ ఎపిసోడ్కీలకం అని చిత్రబృందం ముందు నుంచీ చెబుతూనే వచ్చింది. దానిపైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. అది క్లిక్కయితే సినిమా హిట్టని వాళ్ల నమ్మకం. అయితే దానికి తగ్గట్టుగా ఆ ఎపిసోడ్‌ని తీర్చిదిద్దలేదు. `ఉరి`లో సర్జికల్ స్ట్రైక్ చూసినవాళ్లకెవరికైనా ఈ ఎపిసోడ్లు తేలిపోయినట్టు కనిపిస్తాయి. చివర్లో… చనిపోయిన వెంకీ మామ, అల్లుడి మాటలకు బతికిపోవడం – తెలుగు సినిమాల్లో మాత్రమే కనిపించే మెడికల్ మెరాకిల్. అయితే మధ్యమధ్యలో వచ్చే పాటలు, ముఖ్యంగా ‘కోకోకోలా పెప్సీ..’ మాస్‌ని అలరిస్తాయి. ఫైట్లు, జాతక ప్రభావంతో జరిగే సంఘటనలు ఓకే అనిపిస్తాయి. స్థూలంగా ఇద్దరు హీరోల్ని తెరపై చూడడం, అందులో వెంకీ తనదైన శైలిలో రెచ్చిపోవడం ఫ్యాన్స్‌కి నచ్చుతాయి. వాటితో పాటు ఇంకాస్త బలమైన కథ కూడా ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ వస్తుంది.
నటీనటులు
వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి, ఎనర్జీ గురించీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ రకంగా చైతూ కంటే.. హుషారుగా నటించేశాడు. ఈ సినిమాని వీలైనంత వరకూ మోసుకుంటూ వెళ్లాడు. కామెడీ పార్ట్, ఎమోషన్ సీన్లు.. ఇలా ఎక్కడా తగ్గలేదు. పాటల్లోనూ హుషారైన స్టెప్పులేశాడు. చైతూ కూడా ఉన్నంత వరకూ ఓకే. కానీ ఆ పాత్రని పరిపూర్ణంగా డిజైన్ చేయలేదనిపిస్తుంది. ఇది మల్టీస్టారర్ సినిమానే అయినా వెంకీ ముద్ర అడుగడుగునా కనిపిస్తుంది. వెంకీ పక్కన ఉండి రాణించడం ఎంత కష్టమో చైతూని చూస్తే అర్థం అవుతుంది. రాశీ, పాయల్లవి ఫక్తు కమర్షియల్ హీరోయిన్ టైపు పాత్రలు. రావు రమేష్ పాత్రకి ఎండింగ్ లేదు. ప్రకాష్‌రాజ్, నాజర్… వీళ్లవన్నీ చిన్న చిన్న పాత్రలే. హైపర్ ఆది తనదైన పులిహార సెటైర్లు వేశాడు.
సాంకేతిక వర్గం
తమన్ పాటలు కమర్షియల్ మీటర్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా అంతే. నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన కాస్ట్లీ చిత్రాలలో ఇదొకటి. కశ్మీర్ ఎపిసోడ్లు బాగా పిక్చరైజ్ చేశారు. బాబి ఓ పాత కథని వీలైనంత వరకూ పాతగానే తీయడానికి ప్రయత్నించాడు. ఇక్కడో పాట.. ఇక్కడో ఫైటూ అంటూ లెక్కలు వేసుకుని మరీ సన్నివేశాలు రాసుకున్నాడు. తనకిచ్చిన బడ్జెట్‌కి పూర్తి న్యాయం చేశాడేమో గానీ, ఇద్దరు హీరోలకు మాత్రం కాదు.
ఫినిషింగ్ టచ్: గ్రహ దోషం
తెలుగు360 రేటింగ్ : 2.5/5