విరామం లేకుండా సందీప్ కిషన్ వరుసగా సినిమాలు అయితే చేస్తున్నాడు గానీ… విజయాలు మాత్రం దక్కడం లేదు. ఎవరితో సినిమా చేసినా… ఎలాంటి కథతో సినిమా చేసినా… రిజల్ట్ విషయం వచ్చేసరికి తేడా కొట్టేస్తుంది. కృష్ణవంశీ ‘నక్షత్రం’, తమిళ దర్శకుడు సుశీంద్రన్ తీసిన ‘కేరాఫ్ సూర్య’, మహేశ్‌బాబు సోదరి మంజుల దర్శకురాలిగా పరిచయమైన ‘మనసుకు నచ్చింది’ సినిమాలు పరాజయాలను అందించాయి. దాంతో ఈసారి సందీప్ కిషన్ రూటు మార్చాడు. సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అంటే… హారర్ కామెడీ అన్నమాట. ఇప్పటివరకూ సందీప్ కిషన్ హారర్ సినిమా చేయలేదు. ప్రతి సినిమాలోనూ ఫైట్స్, పాటలు అంటూ హీరోయిజం కోసం చూసుకున్నాడు. హారర్ సినిమాలో అటువంటివి ఇరికించే స్కోప్ వుండదు. అలాగే, హీరో కంటే కమెడియన్స్‌కి ఎక్కువ పేరు వస్తుంది. వీటన్నిటికీ సందీప్ కిషన్ సిద్దపడే ఈ సినిమా చేస్తున్నట్టున్నాడు. ఇందులో ‘వెన్నెల’ కిషోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అప్పుడెప్పుడో ఏడేళ్ల క్రితం వచ్చిన ‘రొటీన్ లవ్ స్టోరీ’లో సందీప్ కిషన్, ‘వెన్నెల’ కిశోర్ నటించారు. వాళ్ళ కాంబినేషన్లో నెక్స్ట్ సినిమా ఇదే. ‘వెన్నెల’ కిశోర్ నటించిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది-2’ హారర్ కామెడీలు హిట్టే. దాంతో ‘వెన్నెల’ తోడుగా హారర్ కాన్సెప్ట్‌తో విజయం కోసం సందీప్ కిషన్ ప్రయత్నిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది.