కమెడియన్లు హీరోగా అయిపోవడం చాలా కామన్. స్టార్ కమెడియన్లని హీరోలుగా చూడాలని ప్రొడ్యూసర్లు, దర్శకులూ ఆశపడడం, ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలని హాస్యనటులు భావించడం చాలా సహజంగా జరిగే విషయాలు. అయితే స్టార్ కమెడియన్ని హీరోగా చేయడంలో ఓ ఇబ్బంది ఉంది. వాళ్లు ప్రమోషన్లకు దొరకరు. ఎందుకంటే చేతి నిండా సినిమాలు ఉంటాయి. హీరోగా తాము చేసిన సినిమాని కూడా ప్రమోట్ చేసుకోలేనంత బిజీ అయిపోతారు. ఇప్పుడు వెన్నెల కిషోర్ విషయంలో ఇదే జరుగుతోంది.
వెన్నెల కిషోర్ హీరోగా ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ అనే సినిమా తయారైంది. వచ్చేవారం విడుదల కానుంది. అయితే ప్రమోషన్ ఈవెంట్లలో హీరో కనిపించడం లేదు. మీడియాకు ఇంటర్వ్యూలు కూడా ఇవ్వడం లేదు. దాంతో ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం సరైన పబ్లిసిటీ లేక ఇబ్బంది పడుతోంది. ”వెన్నెల కిషోర్ చాలా బిజీ. ఆయన చేతి నిండా సినిమాలున్నాయి. అందుకే ప్రమోషన్లకు దొరకడం లేదు. పైగా ఆయన ఇంట్రావర్ట్. పెద్దగా మాట్లాడడు. అందుకే ప్రమోషన్లలో కనిపించడం లేదు” అంటూ నిర్మాతలు అంటున్నారు. అయితే ఇంకో అడుగు ముందుకేసి ”అయినా ఈ సినిమాలో వెన్నెల కిషోర్ హీరో కాడు. కథే హీరో. మేం వెన్నెల కిషోర్‌ని నమ్ముకొని సినిమా చేయలేదు” అని ముక్తాయిస్తున్నారు నిర్మాతలు. వాళ్లకూ వెన్నెల కిషోర్ ప్రమోషన్లకు రావడం లేదన్న అసంతృప్తి ఉంది. వెన్నెల కిషోర్ ఏం మాట్లాడినా ఈ సినిమా పబ్లిసిటీకి ప్లస్ అవుతుంది. కానీ ఆయనే ఈవెంట్లలో కనిపించడం లేదు. దాంతో పాటుగా ఈ చిత్ర సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ తో కూడా నిర్మాతలకు ఓ గ్యాప్ నడుస్తోంది. ఆయనా పబ్లిసిటీలో ఎక్కడా కనిపించడం లేదు.