ఒకప్పుడు మణిశర్మకు మించిన ఆప్షన్ ఉండేది కాదు పెద్ద హీరోలకు. ఆయనా అలాంటి పాటలే ఇచ్చారు. క్లాసూ, మాసూ, ఐటెమ్ సాంగూ.. ఇలా ఎలాంటి బాణీ అయినా రంగరించగలరు. అయితే… వీటిలో మెలోడీలు భలే మెరిసేవి. ప్రతీ ఆల్బమ్లోనూ కచ్చితంగా ఓ మెలోడీ ఉండేది. మణిశర్మ పాటలనగానే ముందుగా గుర్తొచ్చేవి అవే! అయితే కొత్త తరం సంగీత దర్శకుల జోరుతో మణి కాస్త వెనక్కు తగ్గారు. ఇప్పుడు ఆయన హవా అంతగా కనిపించడం లేదు. ఈమధ్య మణి సినిమాలు చేస్తున్నా.. ఆ పాత స్థాయిలో పాటలు రావడం లేదని ఆయన అభిమానులూ చెబుతుంటారు. అయితే ఇప్పుడో పాట వచ్చింది. అది చిన్న సినిమానే అయినా… అందులో మణి మ్యాజిక్ రిపీట్ అయ్యింది. ఆ సినిమానే `బెదురులంక 2012`. కార్తికేయ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. నేహా శెట్టి కథానాయిక. ఈ సినిమా నుంచి `వెన్నెల్లో ఆడపిల్ల` అనే పాట విడుదలైంది. కిట్టూ విస్సాప్రగడ రాశారు. ఇదో చక్కటి మెలోడీ. ఒకప్పటి మణిశర్మ పాటల స్థాయిలో ఉంది. సాహిత్యం సరళంగా ఉంది. ఇనుస్ట్రుమెంటేష్ హాయిగా సాగిపోయింది. తెరకెక్కించిన తీరు కూడా రొమాంటిక్గా సాగింది. తెరపై హీరో – హీరోయిన్ల కెమిస్ట్రీ అందంగా పండింది. ఈ పాట వింటుంటే… క్షణం క్షణంలోని జామురాతిరి పాట గుర్తొస్తుంది. ఈ రెండు పాటల నేపథ్యాలు వేరైనా.. వినగానే ఒకేలాంటి అనుభూతి కలగడం ఖాయం. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.