సినిమాల ద్వారా క్రేజ్ సంపాదించుకున్న తరవాత రాజకీయాలవైపు చూడడం కామనే. హాస్య నటుల విషయంలో ఈ పోకడ మరింత ఎక్కువగా కనిపిస్తుంటుంది. బాబూ మోహన్, ఎమ్మెస్, ధర్మవరపు, అలీ.. ఇప్పటి ఫృథ్వీ…. వీళ్లంతా కమెడియన్లుగా ఓ వెలుగు వెలిగి – రాజకీయాలవైపు టర్న్ అయినవాళ్లే. వేణుమాధవ్ కి కూడా పొలిటిలక్ ఇంట్రస్ట్ ఉండేది. సినిమాల్లోకి రాకముందు టీడీపీ నిర్వహించే ‘మహానాడు’లో చురుకుగా పాల్గొనేవారు. అయితే ఆ వేడుకకు వచ్చినవాళ్లని నవ్వించడమే వేణుమాధవ్ పని. ఆ తరవాత సినిమాల్లోకి వచ్చారు. అయినా సరే, టీడీపీని వదల్లేదు. 2014కి ముందు నుంచే టీడీపీ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో వేణు చురుగ్గా పాల్గొనేవారు. 2014లో కోదాడ నుంచి టికెట్ ఆశించారు. నామినేషన్ కూడా వేశారు. కానీ బీఫామ్ మరొకరికి ఇవ్వడంతో నామినేషన్ విత్డ్రా చేయాల్సివచ్చింది. వేణుమాధవ్ ట్రస్ట్ పేరుతో కొన్ని సేవా కార్యక్రమాల్నీ చేపట్టారు. ‘మా’ ఎన్నికలలో కూడా వేణుమాధవ్ చురుగ్గా పాల్గొనేవారు. గత ‘మా’ ఎన్నికల్లో శివాజీరాజాకు మద్దదు తెలిపారు కూడా. కాకపోతే.. ‘ఎం.ఎల్.ఏ’ అవ్వాలన్న కోరిక మాత్రం తీరలేదు.