వేణు.. ఏంటీనాలా పొడుగ్గా ఉంటాడు. స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ సినిమాలతో ఓ ఊపు ఊపాడు. కొన్నాళ్లకు కామెడీకి కేరాఫ్ గా ఉన్నాడు. ఆ తరవాత అజాపజా లేదు. ఆమధ్యెప్పుడో `దమ్ము`లో ఎన్టీఆర్ బావగా కనిపించాడు. మళ్లీ అడ్రస్ లేకుండా పోయాడు. వేణు తొట్టెంపూడి అనే ఓ హీరో ఉండేవాడు.. అని గుర్తు చేసుకోవడం తప్ప, తానెప్పుడూ మళ్లీ కనిపించలేదు. ఇన్నాళ్లకు టాలీవుడ్ కి తొట్టెంపూడి గుర్తొచ్చాడు. రవితేజ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `రామారావు`. ప్రశాంత్ మాండవ దర్శకుడు. ఈ చిత్రంలో వేణు కి కీలక పాత్ర దక్కింది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈరోజు నుంచే వేణు సెట్లో కూడా అడుగుపెడుతున్నాడు. ఓ ప్రభుత్వ ఉద్యోగి కథ ఇది. ప్రభుత్వ ఉద్యోగుల్లోని అవినీతిని ఎండగడుతూ… సాగుతుంది. రవితేజ పాత్ర భిన్న కోణాల్లో ఉండబోతోందని తెలుస్తోంది. మరి వేణు పాత్ర ఎలా ఉండబోతోందో చూడాలి.