వేణుస్వామి దంపతులపై పోలీసులకు జర్నలిస్ట్ మూర్తి ఫిర్యాదు చేశారు. తాను ఐదు కోట్లు అడిగినట్లుగా తప్పుడు ఆరోపణలు చేశారని.. తన పేరు ప్రతిష్టలకు భంగం కలిగేలా వ్యవహరించారని తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. మూర్తి చేసిన ఫిర్యాదుతో వేణు స్వామి దంపతులకు ఇప్పుడు అసలు సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
వేణు స్వామి దంపతులు ఇద్దరూ మీడియా ముందుకు వచ్చి.. తమను మూర్తి ఐదు కోట్లు అడిగారని.. ఎవరో ముక్కూ ముఖం తెలియని వ్యక్తి ఆడియో టేపును వినిపించారు. తర్వాత తాము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరింపులు కూడా ప్రారంభించారు. దీనంతటికి కారణం వేణుస్వామి నిర్వాకాలపై టీవీ5లో మూర్తి షో రన్ చేయడమే. ఆయన బాధితులు చాలా మంది బయటకు వచ్చి.. తమను ఎలా మోసం చేశారో చెబుుతున్నారు. దీంతో తన గుట్టు అంతా బయటపడిపోతోందని వేణు స్వామి.. మూర్తిని బ్లాక్ మెయిల్ చేయడానికి .. లంచం ఆరోపణలు.. ఆత్మహత్య బెదిరింపులు చేశారు.
అయితే నిజాయితీ జర్నలిస్టుల్లో ముందుండే మూర్తి.. వెంటనే మీడియా ముఖంగానే స్పందించారు. చిన్న ఆధారం చూపించినా.. నడిరొడ్డుపై రాళ్లతో కొట్టి చంపాలని సవాల్ చేశారు. వారి వద్ద ఉన్న ఆధారాలను తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ చేశారు. కానీ వేణు స్వామి దంపతులు సైలెంట్ అయిపోయారు. దీంతో వారు చేసింది తప్పుడు ఆరోపణలని తేలిపోయింది. ఇప్పుడు పోలీసులు వాటికి సాక్ష్యాలు అడుగుతారు. ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటారు. మొత్తంగా మూర్తిని బెదిరించాలనుకుని.. వేణుస్వామి.. నిండా మునిగిపోయే పరిస్థితి వచ్చింది.