స్వయం వరం, చిరునవ్వుతో లాంటి సినిమాలతో కొన్నాళ్ల పాటు ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్స్గా నిలిచాడు వేణు. ఆ తరవాత… సడన్గా మాయమై, మళ్లీ ఎప్పటికో `దమ్ము`లో తేలాడు. ఎన్టీఆర్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. ఇందులో వేణు ఓ పాత్ర పోషించాడు. దాన్ని క్యారెక్టర్ ఆర్టిస్టు అనలేం.. జూనియర్ ఆర్టిస్టూ అనలేం. ఆ సినిమా తరవాత ఆ తరహా అవకాశాలు కూడా వేణుకి రాలేదు. ఎట్టకేలకు మళ్లీ `రామారావు ఆన్ డ్యూటీ`లో ప్రత్యక్షమయ్యాడు. ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకొన్నాడు వేణు. ఎక్కడికి వెళ్లినా తన రీ ఎంట్రీ ఘనంగా ఉంటుందని చెబుతున్నాడు. తాజాగా దమ్ములో తన క్యారెక్టర్ గురించి కొన్ని సరదా కామెంట్లు చేశాడు.
షోలోలే అమితాబ్ లాంటి పాత్ర నీది.. అని దమ్ములో వేణుని తీసుకొన్నాడట బోయపాటి. ఆ తరవాత సంగతి తెలిసిందే. ఎడిటింగ్ లో చాలా సీన్లు లేచిపోయాయి. ”షోలేలో అమితాబ్ పాత్ర అన్నారు. తీరా చూస్తే ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ సినిమాలో అమితాబ్ చనిపోయినట్టు.. దమ్ములో నేను చనిపోతాను. ఈ రెండు సినిమాల మధ్య పోలిక అదొక్కటే” అని తనపై తనే సెటైర్ వేసుకొన్నాడు. అయితే ఆ సినిమా చేసినందుకు ఎప్పుడూ ప్రశ్చాత్తాపపడలేదని చెప్పాడు. ”ఇదో ప్రయాణం.. ఆ దారిలో నాకొచ్చిన పాత్రల్ని గౌరవించుకుంటూనే వెళ్లా. ఓ తప్పు చేస్తే… అక్కడితో ప్రయాణం ఆగిపోయినట్టు, దారులన్నీ మూసుకుపోయినట్టు కాదు కదా“ అని చెప్పాడు వేణు. `రామారావు ఆన్ డ్యూటీ`లో సీఐ మురళిగా కనిపించబోతున్నాడు వేణు. “రవితేజ లాంటి స్టార్ సినిమాలో చేయడం ఆనందంగా ఉంది. పెద్ద సినిమాతో రీ ఎంట్రీ ఇస్తే.. చాలామందికి చేరువ అవుతాను. ఆ నమ్మకంతోనే ఈ సినిమా ఒప్పుకొన్నా” అని చెప్పుకొచ్చాడు.