హైదరాబాద్: విజయవాడలో కత్తులు దూసుకునే రెండు వర్గాలలో ఒకటైన ‘వంగవీటి’ పేరుతో ఒక చిత్రాన్ని తీయబోతున్నట్లు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్ర వివరాలను ఆయన ఇవాళ ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ సినిమాలో ఏ ఒక్కరినో హీరోగా గానీ, విలన్గా గానీ చూపించనని, పరిస్థితులనే ప్రధానంగా తీసుకుంటానని వర్మ చెప్పారు. రంగా హత్య వెనక ఎవరున్నారనే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించనని అన్నారు. రంగా పెళ్ళికి ఈ సినిమాలో చాలా ప్రధాన్యం ఉంటుందని, రంగా-రత్నకుమారి ప్రేమకథ తనను బాగా ఆకట్టుకుందని చెప్పారు. హింసాకాండా బాగానే ఉంటుందని తెలిపారు. రిలీజ్ డేట్ కమిట్ అవలేనని అన్నారు. తాను త్వరలో ముంబాయికి మకాం మారుస్తున్నప్పటికీ ఈ సినిమాను యధావిధిగానే చేస్తానని చెప్పారు. తన చిన్నతనంలో వంగవీటి రాధా హత్య జరిగినపుడు తన చిన్నాన్న ఇంటికొచ్చి ఆ హత్య గురించి చెప్పినపుడు ఆయన ముఖంలో కనిపించిన భయం, ఉద్విగ్నత తనను ఈ సినిమాను తీయటానికి పురికొల్పాయని అన్నారు. కులాల గురించి మాట్లాడుతూ, కులాభిమానం ఉంటే తప్పేముందని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు.