క్రికెట్లో వెటరన్ అనే మాట ఎక్కువగా వాడుతుంటారు. ఆటగాడిగా రిటైర్ అయిపోయిన తరవాత.. వాళ్లంతా వ్యక్తిగత జీవితాలకు పరిమితం అయ్యేవారు. ఇప్పుడు ఐపీఎల్ వచ్చింది. దాంతో రిటైర్ ఆటగాళ్లంతా కోచ్‌లుగా, మెంటర్లుగా మారుతున్నారు. సినిమాల్లోనూ అదే జరుగుతోంది. హీరోలుగా, హీరోయిన్లుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఓవెలుగు వెలిగిన వాళ్లంతా ఇప్పుడు ఇళ్లకే పరిమితం అవ్వడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ అంటూ కొత్త ప్రయాణం మొదలెడుతున్నారు. తమకంటూ కొత్త అవకాశాల్ని సృష్టించుకొంటున్నారు.
కొత్త నీరు వచ్చి పాత నీరుని తోసేస్తుంది అంటారు. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్తవారు వస్తుంటారు, పాత తరం వెనకబడిపోతారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. పాతతరం నటీ నటులు, ఫేడ్ అవుట్ అయిపోయిన వాళ్లూ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో కొందరు విజయవంతంగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరికొందరు ఇంకా తమ అదృష్టాన్ని పరిక్షికుంటున్నారు. హీరోయిన్స్ లో త్రిష, నయన తార లాంటి వారు క్రేజ్ తగ్గుతున్న సమయంలో మంచి ఆఫర్స్ అందుకుని సత్తాచాటి నిలదొక్కుకున్నారు. ఇప్పుడు త్రిష తెలుగు, తమిళ భాషల్లో ఫుల్ బిజీ. నయనతార అయితే, బాలీవుడ్ లోనూ అడుగు పెట్టింది. వీరిద్దరికీ ఇప్పుడు పూర్వ వైభవం వచ్చినట్టే. ప్రియమణి కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు హిందీ లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ బిజీ బిజీగా గడుపుతోంది. అనుష్క ఇప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది.
జగపతి బాబు లాంటి ఫ్యామిలీ స్టార్ కూడా హీరోగా అవకాశాలు తగ్గగానే ప్రతినాయకుడిగా రీఎంట్రీ ఇచ్చి, విజయం సాధించాడు. `లెజెండ్` తరవాత ఇప్పటి వరకూ ఏమాత్రం ఖాళీ లేకుండా ప్రయాణం కొనసాగిస్తున్నారు. రీ ఎంట్రీ ఇద్దాం అనుకొంటున్న వాళ్లందరికీ జగ్గూభాయ్‌నే ఆదర్శం. సీనియర్ హీరోయిన్స్ విజయ శాంతి, సుహాసిని, ఇంద్రజ, రమ్య కృష్ణ, ఈశ్వరీ రావు, కుష్బూ, రాధిక, నదియా లాంటి వారు ఎప్పటికప్పుడు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వాళ్లకు వెండి తెర ఇప్పుడు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతోంది. అందుకే అందరూ బిజీ అయిపోయారు.
ఈ మధ్య జేడీ చక్రవర్తి ‘దయా’ వెబ్ సిరీస్ తో, శివాజీ ‘#90’ వెబ్ సిరీస్ తో తమ జర్నీ మళ్ళీ మొదలు పెట్టారు. ఇప్పుడు ‘6 టీన్స్’, ‘జానకి వెడ్స్ శ్రీరామ్’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహిత్, స్టూడెంట్ నంబర్ వన్ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించిన గజాలా కూడా సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయ్యారు. ఒకప్పుడు కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరు తెచ్చుకొన్న వడ్డే నవీన్ మళ్ళీ ఇన్నాళ్ళకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ప్రభాస్ – హను రాఘవ పూడి సినిమాలో ప్రభాస్ కి అన్నయ్యగా నవీన్ వడ్డే నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అదెంత వరకూ నిజమో తెలియాల్సివుంది. వేణు తొట్టెంపూడి కూడా ఈమధ్య కొన్ని సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లలోనూ కనిపించాడు. తనకూ మంచి ఆఫర్లే అందుతున్నాయి. మన్మథుడు హీరోయిన్ అన్షు సందీప్ కిషన్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తోంది. వీరంతా ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.