హారర్ ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ జోనర్లో ఫ్లాపులు వరసబెడుతున్నా, పుంకానుపుంకాలుగా ఈ తరహా కథలు తయారవుతూనే ఉన్నాయి. ఫ్యామిలీ టైపు సినిమాలు చేసుకొనే శ్రీకాంత్ `రా.. రా` అంటూ హారర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు రాశీ కూడా.. సై అంటోంది. రాశీ ప్రధాన పాత్రలో ఓ హారర్ సినిమా రూపుదిద్దుకొంది. దాని పేరు `లంక`. శ్రీముని ఈ చిత్రానికి దర్శకుడు. దినేష్ నమన, విష్ణు కుమార్ నమన నిర్మాతలు. ఫస్ట్ కాపీ కూడా పూర్తయిపోయింది. త్వరలోనే పబ్లిసిటీకి శ్రీకారం చుట్టబోతోంది `లంక` టీమ్.
‘నిజం’లో వ్యాంపు తరహా పాత్ర పోషించిన తరవాత సినిమాలకు పూర్తిగా దూరమైంది రాశీ. మధ్యలో కొన్ని టీవీ షోలు చేసినా.. ఫలితం లేకపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మేకప్ వేసుకోవడానికి మక్కువ చూపిస్తోంది. అయినా తనకు ఆంటీ, అత్త పాత్రలే దొరుకుతాయి. అయితే.. ‘లంక’లో దాదాపు హీరోయిన్ స్థాయి పాత్ర దక్కేసింది. తనే మెయిన్ లీడ్. హారర్ సినిమాల్లో లంక ఓ కొత్త ప్రయత్నమని, చంద్రముఖిలో జ్యోతికకు ఎంత పేరొచ్చిందో, ఈ సినిమాలో రాశీకి అంత పేరొస్తుందని చిత్రబృందం ధీమాగా చెబుతోంది.