దుబాయ్ లో జుమేరా హోటలో అలనాటి క్రికిట్ దిగ్గజాలు కపిల్ దేవ్, షేన్ వార్నె, ఇయాన్ బోతం మరియు వసీం అక్రం ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసందర్భంగా సచిన్ టెండూల్కర్ గురించి కపిల్ దేవ్ కొన్ని ఆసక్తికరమయినవ్యాఖ్యలు చేసారు.
“సచిన్ టెండూల్కర్ అత్యద్భుతమయిన బ్యాట్స్ మ్యాన్ అని నేను ఒప్పుకొంటాను. అయితే ఆయనకి ఒక సెంచరీ ఎలా చేయాలో మాత్రమే తెలుసు కానీ డబుల్, ట్రిపుల్ సెంచరీలు..నాలుగు వందల రన్స్ ఎలా చేయాలో తెలియదు. అందుకు కారణం ఆయన వివిన్ రిచర్డ్స్ వంటి అంతర్జాతీయ ప్లేయర్స్ తో సహవాసం చేసే బదులు ఎక్కువ సమయం ముంబై క్రికెట్ ఆటగాళ్ళతోనే గడపడమేనని నేను భావిస్తున్నాను. నేనెప్పుడూ సచిన్ టెండూల్కర్ నుండి ఇంకా చాలా ఎక్కువ ఆశించేవాడిని. ఆయన తన ప్రతిభకు పూర్తి న్యాయం చేయలేకపోయారని నేను భావిస్తున్నాను. క్రికెట్ ఆటలో పరుగులు సాధించే విషయంలో బ్యాట్స్ మ్యాన్ బౌలర్ల పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించవలసి ఉంటుంది. వివిన్ రిచర్డ్స్ ఆవిధంగానే ఆడేవారు. అందుకే ఆయన కెరీర్ చాలా అత్యద్భుతంగా సాగింది. సచిన్ టెండూల్కర్ కూడా అలాగే ఆడి ఉండి ఉంటే ఆయన తన ప్రతిభకు పూర్తి న్యాయం చేసి ఉండేవారు. ఆయన సెహ్వాగ్ లాగ చాలా స్వేచ్చగా, క్రికెట్ ని చాలా ఆనందిస్తూ ఆడి ఉన్నా బాగుండేది. సచిన్ ఎంతసేపు సెంచరీ పూర్తి చేస్తే చాలానే ఆలోచనతోనే ఆడుతున్నట్లు నాకు అనిపించేంది. నిజానికి ఆయన వంటి అత్యద్భుతమయిన క్రీడాకారుడు ఇంకా గొప్ప ప్రదర్శన ఈయవచ్చునని నా అభిప్రాయం,” అని కపిల్ దేవ్ అన్నారు.