గుంటూరులో వెటరన్ పొలిటికల్ లీడర్స్ రాజీ పడిపోయారు. అయితే.. ఇది రాజకీయంగా అంతర్గతంగా జరిగే పరిణామం కాదు. నిజంగానే రాజీ పడ్డారు. ఓ పరువు నష్టం కేసులో ఈ రాజీ జరిగింది. రాజకీయాల్లో ఒకే పార్టీలో ఉండి ఉప్పూ..నిప్పులా వ్యవహరించిన కన్నా, రాయపాటి ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇరువురి మధ్య పెద్దగా రాజకీయ వైరం ఏమీ లేదు ఎందుకంటే ఇద్దరూ ప్రత్యర్థులుగా తలపడుతోంది కానీ.. ఒకే పార్టీలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నది కానీ ఏమీ లేదు. దీంతో ఇప్పుడు ఆ పాత వైరం తాలూకా కేసులు ఎందుకున్నారేమో కానీ… వదిలేసుకుందామని డిసైడయ్యారు.
2010లో కన్నా లక్ష్మినారాయణ మంత్రిగా ఉండేవారు.. రాయపాటి సాంబశివరావు ఎంపీ. ఇద్దరూ కాంగ్రెస్సే. అయితే ఇద్దరికీ సరిపడదు. గుంటూరులో కాంగ్రెస్కు ఇద్దరూ దిగ్గజ నేతలే. ఆ టైంలో రాయపాటి సాంబశివరావు కన్నాపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై కన్నా బాధపడ్డారు. అంతటితో ఆగలేదు.. అప్పటి సీఎం వైఎస్ అనుమతిని పరోక్షంగా తీసుకుని రాయపాటిపై పరువు నష్టం దావా వేశారు. గుంటూరులో ఆ కేసు విచారణ సాగుతూ వస్తోంది. తాజాగా కేసు వాయిదాకు ఇద్దరు నేతలు హాజరయ్యారు.
ఇక మనకు కేసులెందుకు… అని అనుకుని రాజీకి రావాలని నిర్ణయించుకున్నారు. అదే విషయాన్ని కోర్టుకు చెప్పారు. కోర్టు కూడా అంగీకరించింది. ఈ వివాదం తేలిపోవడంతో ఇద్దరి మధ్య రాజకీయ వైరం అధికారికంగా కూడా తెగిపోయినట్లయింది. రాయపాటి వృద్ధాప్యం కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఆయన టీడీపీలో ఉన్నారు. సీబీఐ కేసులూ వెంటాడుతున్నాయి. మరో వైపు కన్నా.. రాజకీయ భవిష్యత్ ను ఎక్స్టెండ్ చేసుకోవడానికి కొత్త వ్యూహాలు అమలు చేసే ప్రయత్నంలో ఉన్నారు.