తెలుగు సినీ పరిశ్రమ మరో గొప్ప వ్యక్తిని కోల్పోయిందీరోజు. ప్రముఖ కధా రచయిత, నటుడు చిలుకోటి కాశీ విశ్వనాధ్ ఈరోజు మధ్యాహ్నం గుండెపోటుతో మరణించారు. ఆయన సికిందరాబాద్ నుండి లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో విశాఖపట్నం వస్తుండగా రైలు ఖమ్మం రైల్వే స్టేషన్ చేరుకొంటున్న సమయంలో తీవ్రమయిన గుండెపోటు రావడంతో క్షణాలలోనే మరణించారు. రైల్వే అధికారులు ఆయన శరీరాన్ని ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రిలో భద్రం చేసారు.
కాశీ విశ్వనాద్ (69) సుమారు 120 కధలు, 28 నవలలు, 43 నాటికలు, అనేక సినిమాలకు కధలు వ్రాసారు. ఆయన 37 సినిమాలలో నటించారు. ఆ కారణంగా సినీ పరిశ్రమలోని అందరు ప్రముఖ దర్శకులు, నిర్మాతలు నటీ నటులతో ఆయనకు మంచి పరిచయాలున్నాయి. మూడు రోజుల క్రితమే ప్రముఖ నటుడు రంగనాద్ తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడాన్ని తెలుగు సినీ పరిశ్రమ, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంతలోనే మళ్ళీ మరో అసమానమయిన ప్రతిభగల నటుడు రచయితని కోల్పోవడం చాలా బాధ కలిగిస్తోంది.