Vettaiyan Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్-
‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అనేది పాపులర్ కోట్. సకాలంలో అందని న్యాయం న్యాయమే కాదనేది దీని అర్ధం. ఏదైనా ఒక తప్పు జరిగితే నిందితుల్ని రెప్పపాటు కాలంలో శిక్షించేయాలనే ఓ అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమౌతుంటుంది. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఎన్ కౌంటర్ లాంటి ఆటవిక చర్యకి పాల్పడటం అనేక సందర్భాల్లో చూశాం. ఇక్కడే ఇంకో మాటని గుర్తు చేసుకోవాలి. ‘జస్టిస్ హర్రీడ్ ఈజ్ జస్టిస్ బర్రీడ్’ ఆవేశంలో తొందరలో న్యాయం జరిగిపోవాలనే డిమాండ్ కూడా న్యాయాన్ని, నిజాన్ని కప్పెట్టేస్తుంది కొన్నిసార్లు. ఇదే పాయింట్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది రజనీకాంత్ ‘వేట్టయన్’. మరి ఈ పాయింట్ ప్రేక్షకులని అలరించిందా? రజనీ బుల్లెట్టు టార్గెట్ కి రీచ్ అయ్యిందా?
అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. కన్యాకుమారిలో ఎస్పీగా విధులు నిర్వహిస్తుంటాడు. ఓ మారుమూల గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంటుంది శరణ్య (దుషారా విజయన్). శరణ్య ఇచ్చిన కంప్లయింట్ ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్ కౌంటర్ చేస్తాడు అదియన్. అది జరిగిన కొన్నాళ్ళకి శరణ్యని ఎవరో దుండగుడు అతి కిరాతకంగా మానభంగం చేసి హత్య చేస్తాడు. ఈ కేసులో ఓ అనుమానితుడ్ని పోలీసులు అరెస్టు చేస్తారు. అతడు పోలీసుల కళ్ళుగప్పి తప్పించుకుంటాడు. దీంతో పబ్లిక్ లో పోలీసుల పని తీరుపై అగ్రహం వ్యక్తమౌతుంది. అతడ్ని ఎన్ కౌంటర్ చేయడానికి అదియన్ రంగంలోకి దిగుతాడు. తర్వాత ఏమైయింది ? ఈ కేసులో అసలు దోషులు ఎవరు? ఈ కథలో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి) పాత్రేమిటి? చివరికి బాధితులకు ఎలాంటి న్యాయం జరిగిందనేది మిగతా కథ.
‘జై భీమ్’ తీసిన టీజే జ్ఞానవేల్ ఈ సినిమాకు దర్శకుడు. ‘జై భీమ్’ లో లాకప్ డెత్, ఎన్ కౌంటర్ లపై తనదైన స్వరం వినిపించిన దర్శకుడు ఇందులో కూడా అదే ‘న్యాయం’ అంశాన్ని తీసుకొని విద్యా వ్యవస్థతో ముడిపెట్టి ‘వేట్టయన్’ కథ చెప్పే ప్రయత్నం చేశాడు. గవర్నమెంట్ స్కూల్స్ లో విద్యార్ధుల తీరుపై వైరల్ అయిన కొన్ని వీడియోలు చూపిస్తూ కథ మొదలౌతుంది. ఈ కథకు బీజం అక్కడే పడింది కానీ బిగినింగ్ లో ఆ సన్నివేశాలు అంతగా రిజిస్టర్ కావు, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ రజనీ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకుడి ఆయన రాక కావాల్సిన జోష్ ఇస్తుంది. ఇంట్రో ఫైట్, సాంగ్ ఫ్యాన్స్ కి నచ్చేస్తాయి. శరణ్య ఎపిసోడ్ తో అసలు కథ మొదలౌతుంది. తొలి సగంలో సన్నివేశాలు ఎక్కడా బోర్ కొట్టించకుండా ముదుకుసాగుతాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ ముందే ఊహించిననప్పటికీ వాట్ నెక్స్ట్ అనే ఆసక్తిని కలిగిస్తుంది.
‘వేట్టయన్’ సెకండ్ హాఫ్ లో అసలు సమస్య మొదలౌతుంది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథని నడపాలని చూసే ప్రయత్నాని బలమైన రైటింగ్ తోడవ్వలేదు. ఎడ్ టెక్ కంపెనీ, విద్యా వ్యవస్థ చుట్టూ నడిపిన సన్నివేశాలని సాగదీశారు. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ లో మలుపులు కీలకం. అయితే ఇందులో ప్రతిది ఊహకు అందిపొతుంటుంది. నిజానికి ఈ కథని జైభీమ్ లా రూటెడ్ గా చెప్పొచ్చు. అయితే రజనీ ఫ్యాన్స్ కోసం అన్నట్టుగా కొన్ని యాక్షన్ సీన్లు పెట్టారు కానీ అవి కథలో అంతగా ఇమడలేదు. ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్) క్యారెక్టర్ తో ఓ ఎమోషన్ ని జోడించే ప్రయత్నం పర్వా లేదనిపిస్తుంది. రజనీ, రానా మధ్య వచ్చే లిఫ్ట్ సీక్వెన్స్ లో రజనీ మార్క్ మాస్ మూమెంట్ కనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ కి వచ్చేసరికి సోషల్ మెసేజ్ కాస్త ఎక్కువ దట్టించిన ఫీలింగ్ కలుగుతుంది. విద్యా వ్యవస్థ గురించి దర్శకుడి ఆలోచన బావుంది కానీ మరీ టీవీ షోలో డిబేట్ లా ఉపన్యాసాలు దంచికొట్టడం అంతగా ఆకట్టుకోదు. అయితే దర్శకుడు తను చెప్పదలచుకున్న పాయింట్ ని ఎలాంటి డైవెర్షన్ లేకుండా చెప్పడం మెచ్చుకోదగ్గ విషయమే.
రజనీకాంత్ అంటేనే శ్వాగ్. ఆయన ఏజ్ కి తగిన పాత్రే. ఆయన స్టయిల్ లో చేసుకుంటూ వెళ్లారు. అయితే దీన్ని ప్యూర్ రజనీ సినిమాలా కాకుండా డైరెక్టర్ ఫిల్మ్ గానే చూడాలి. రజనీ నుంచి మాస్ కొరుకునే ఎలిమెంట్స్ ఆశించి అడుగుపెడితే నిరాశపడే ఛాన్స్ వుంది. రజనీయిజం ఇందులో కనిపించదు. అమితాబ్ బచ్చన్ పాత్ర హుందాగా వుంది. ఆయనది న్యాయాన్ని కాపాడే పాత్ర. తన అనుభవంతో ఆ పాత్రకు ఒక డిగ్నిటీ తీసుకొచ్చారు. ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ కొంచెం వెరైటీ. దొంగ పోలీస్ లాంటి పాత్ర. తనదైన శైలీలో చలాకీగా చేశాడు. రజనీపై అభిమానంతో ఆ పాత్ర చేసినట్లుగా అర్ధమౌతుంటుంది. రానాకి ఇలాంటి పాత్ర చేయడం కొత్తకాదు. తన పర్సనాలిటీ ఆ పాత్రకు ప్లస్ అయ్యింది. మంజువారియర్ ది తక్కువ నిడివి వున్న పాత్రే. సెకండ్ హాఫ్ లో మంచి సీన్ పడింది. దుషారా విజయన్ చాలా సహజంగా నటించింది. గుర్తుండిపోయే పాత్ర అది. రావు రమేష్, కిషోర్ తో పాటు మిగతా నటులు పరిధిమేరకు కనిపించారు.
అనిరుద్ నేపధ్య సంగీతంలో ఎప్పుడూ నిరాశపరచడు. ఇందులో కూడా తన మార్క్ బీజీఎం వినిపించాడు. కెమెరాపనితనం బావుంది. ఎడిటింగ్ ఇంకా షార్ఫ్ గా వుండే ఛాన్స్ వుంది. సెకండ్ హాఫ్ లో ట్రిమ్ చేయొచ్చు. నేను గురి పెడితే ఎర పడాల్సిందే అనే రజనీ రిపీట్ డైలాగ్ బావుంది. ఈ మధ్య కాలంలో రజనీ నుంచి పెద్ద అంచనాలు లేని సినిమాగా థియేటర్ కి వచ్చింది వేట్టయన్. ఎలాంటి అంచనాలు వెళితే.. ఓసారి చూడదగ్గ సినిమానే ఇది.
తెలుగు360 రేటింగ్: 2.75/5
-అన్వర్-