విజువల్ ఎఫెక్ట్స్ ఉంటే ఏదైనా చేసేయొచ్చు. వెండి తెరపై అద్భుతాలు సృష్టించొచ్చు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా భ్రమింపచేయొచ్చు. ఆఖరికి నటీనటులు లేకపోయినా, వాళ్లున్నట్టు సీన్లు లాగించేయొచ్చు. `రాధే శ్యామ్`లో ఇదే జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్ – పూజా హెగ్డేలపై ఓ పాట ఉంది. దాన్ని ప్రభాస్, పూజాలు లేకుండానే పూర్తి చేసేశారు. అదే.. ఇక్కడ మ్యాజిక్కు.
రాధే శ్యామ్ లో ఓ శృంగార భరితమైన గీతం ఉంది. ఆ పాట తెరకెక్కించడానికి పూజా హెగ్డే కాల్షీట్లు అందుబాటులో లేవు. పైగా పూర్తి రొమాంటిక్ పాట అది. అలాంటి పాటల్లో నటించడానికి ప్రభాస్‌కి బాగా సిగ్గు… మొహమాటం. అందుకే చిత్రబృందం వీఎఫ్ఎక్స్ సహాయం తీసుకుందని టాక్. బాడీ డబుల్ అనే ఓ పద్ధతి ఉంది. అంటే… డూప్ అన్నమాట. ప్రభాస్, పూజాల డూప్లతో.. ఆ పాట పూర్తి చేసేశారు. క్లోజులు పెట్టేటప్పుడు మాత్రం ప్రభాస్, పూజా హెగ్డేల ఫేసులు కనిపిస్తాయి. ఆ పాటని 90 శాతం బాడీ డబుల్స్‌తోనే పూర్తి చేశారని టాక్. ఇదే కాదు.. ఈ సినిమాలోని కొన్ని షాట్స్ ని.. ప్రభాస్, పూజాల డూపులతో లాగించేశార్ట. వీఎఫ్ఎక్స్ మహిమే అది. దాంతో ఏదైనా సాధ్యమే. భవిష్యత్తులో హీరో, హీరోయిన్లు సెట్లోకి అడుగుపెట్టకుండానే మొత్తం సినిమా లాగించేసినా చేయొచ్చు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు.