విజువల్ ఎఫెక్ట్స్‌తో సినిమా అనేసరికి సవాలక్ష సమస్యలు. ముఖ్యంగా విడుదల తేదీ పక్కాగా నిర్ణయించలేం. రిలీజ్ డేట్ అనేది విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్న కంపెనీల చేతుల్లోనే ఉంటుంది. వాళ్లు ఫైనల్ అవుట్ పుట్ ఇచ్చేంత వరకూ నమ్మలేం. ఇది వరకు ‘రోబో 2.ఓ’ లాంటి సినిమాలు ఆలస్యం అవ్వడానికి కారణం.. ఇదే. ఇప్పుడు `సైరా`కీ ఈ టెన్షన్ పట్టుకుంది.
దాదాపు 26 స్డూడియోలలో ‘సైరా`’వీఎఫ్ఎక్స్ పనులు సాగుతున్నాయి. ఇందులో ఒక్క స్టూడియో.. డుమ్మా కొట్టినా రిలీజ్‌డేట్ విషయంలో సమస్యలు ఎదురవుతాయి. అక్టోబరు 2న ఈ సినిమాని విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేసింది. రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసింది. అయితే.. అప్పటికి వీఎఫ్ఎక్స్ పనులు అవుతాయా? లేదా? అనే టెన్షన్ మాత్రం సైరా టీమ్‌కి చాలానే ఉంది. అందుకే వీఎఫ్ఎక్స్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రతీ స్డూడియోకి ఇచ్చిన పని ఎంత? రోజువారీగా వాళ్లు చేస్తున్న వర్క్ ఎంత? అనే విషయం ఎప్పటికప్పుడు లెక్కలు వేసేసుకుంటున్నారు. తద్వారా ఎవరైనా వర్క్ విషయంలో స్లోగా ఉంటే, ఆ కంపెనీకి ఇచ్చిన అవుట్ పుట్ మరో కంపెనీకి అప్పగించే వెసులుబాటు ఉంటుంది. వీఎఫ్ఎక్స్ లో ఎంత చేసినా సంతృప్తి ఉండదు. చివరి వరకూ మార్పులూ చేర్పులూ ఉంటాయి. కాకపోతే మరీ సన్నివేశాల్ని చెక్కకుండా, చేసిందే చేయకుండా.. ఓ డెడ్‌లైన్ పెట్టుకుని, ఆలోగా పనులన్నీ పూర్తి చేయాలని నియమంగా పెట్టుకున్నారు. వీఎఎఫ్ఎక్స్ ల పని ఎంత వరకూ వచ్చింది? అనే విషయాన్ని ఆరా తీయడానికే ఓ టీమ్‌ని ప్రత్యేకంగా నియమించింది సైరా బృందం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏమైనా అనుకోని అవాంతరం ఎదురై, విడుదల తేదీ మార్చాల్సి వస్తే ఏమిటన్న విషయంలోనూ చిరు బృందం ప్లాన్ బి సిద్ధం చేసుకుంది.కానీ ఆ అవసరం రాకుండా ఉండాలని చిత్రబృందం కష్టపడుతోంది. వీఎఫ్ఎక్స్తో పెట్టుకుంటే… ఇన్ని కష్టాలు అనుభవించాల్సిందే మరి.