ఆయన వస్తారో రారో ఇంకా ఖరారు కాలేదుగానీ… రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే ఏంటనే చర్చలు ఇప్పుడే మొదలైపోయాయి! టీడీపీని వీడేందుకు రేవంత్ సన్నాహాలు చేసుకుంటున్నారనీ, దీన్లో భాగంగానే రాహుల్ గాంధీతో భేటీ అయ్యారని కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ నేతలు చాలా సీరియస్ అవుతున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరిని రేవంత్ రెడ్డి తప్పుబట్టిన తీరూ చూశాం. ఇదిలా ఉంటే.. టి. కాంగ్రెస్ లో కూడా రేవంత్ చేరిక చర్చ జరుగుతున్నట్టు సమాచారం. ఆయన పార్టీలో చేరితే మంచిదే అనే అభిప్రాయం సీనియర్ల నుంచి వ్యక్తమౌతోంది. రేవంత్ చేరితే యువతలో కొత్త ఉత్సాహం వస్తుందనీ, పార్టీ ప్రచారంలో చురుకుదనం వస్తుందనీ అంటున్నారు.
అయితే, రేవంత్ ను తాను ఎప్పుడో పార్టీలోకి ఆహ్వానించానని సీనియర్ నేత వీ హన్మంతరావు చెబుతున్నారు. టీడీపీలో ఉండి ఏం సాధిస్తావని గతంలో ఓసారి తాను ప్రశ్నించానీ, కేసీఆర్ పై పోరాటం చేయాలంటే కాంగ్రెస్ ఒక్కటే సరైన వేదిక అని రేవంత్ కి ఎప్పుడో చెప్పానని అన్నారు. ఆ పోరాటమేదో కాంగ్రెస్ లో ఉండి చేస్తే చాలా ఉపయోగపడుతుందని సూచించాను అంటున్నారు. టీడీపీలో కూర్చుని ఎన్ని గొప్ప పోరాటాలు చేసినా ఆ పార్టీ పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. రాజకీయంగా తానొక్కడే మోనోపొలీ కావాలన్నట్టుగా ఇతర పార్టీల నుంచి నేతల్ని కేసీఆర్ పిలుచుకున్నారనీ, కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా పోరాడాలంటే అందరూ చేతులు కలపాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస వ్యతిరేకంగా పోరాడేవాళ్లను కలుపుకుని పోవాలనదే హైకమాండ్ ఆలోచన అనీ, రేవంత్ పార్టీలోకి వస్తే మంచిదే, బాగానే ఉంటది అని హన్మంతరావు స్పష్టం చేశారు. ఈయనతోపాటు జగ్గారెడ్డి కూడా రేవంత్ రాకను స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్ లోకి రేవంత్ వస్తే భారీ ఎత్తున స్వాగత కార్యక్రమాలు నిర్వహించాలనే చర్చ కూడా జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఒకరిద్దరు సీనియర్లు మినహా, ఆయన రాకపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదన్నట్టు కథనాలు వస్తున్నాయి.
రేవంత్ ను కాంగ్రెస్ లోకి ఇంతకుముందే పిలిచానని వీహెచ్ ఇప్పుడు చెబుతూ ఉండటం విశేషం. ఒకవేళ రేవంత్ చేరిక జరిగితే… ఆ క్రెడిట్ తనదే అంటారేమో మరి! ఏదేమైనా, రేవంత్ వస్తే చేర్చుకునేందుకు కాంగ్రెస్ కూడా సానుకూలంగా ఉందనేది వీహెచ్ వ్యాఖ్యల ద్వారా అర్థమౌతోంది. పైగా, హైకమాండ్ మనోగతం కూడా ఆయన చెప్పారు కదా! తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఓ స్టార్ కేంపెయినర్ అవసరం కచ్చితంగా ఉంది. కాబట్టి, రేవంత్ వస్తానంటే వద్దనే పరిస్థితి అక్కడ లేదు. హైకమాండ్ కూడా వారించే అవకాశమూ లేదు. అయితే, పార్టీ మార్పుపై రేవంత్ ఇంకా స్పష్టత ఇవ్వాలి కదా!