హైదరాబాద్ లో నిన్న జరిగిన కాపునాడు సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నేత వి. హనుమంత రావు మాట్లాడుతూ “కాపులకి రిజర్వేషన్లు కోరుతూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా మద్దతు పలకాలి. ప్రధాని నరేంద్ర మోడీతో పవన్ కళ్యాణ్ కి మంచి సాన్నిహిత్యం ఉంది కనుక వీలైతే ఆయనతో మాట్లాడి కాపులకి రిజర్వేషన్లు వచ్చేలా చేయాలి,” అని అన్నారు.
వి. హనుమంత రావు ఏపికి సంబంధించి ఏ సమస్య గురించి మాట్లాడినా ఈవిధంగా పవన్ కళ్యాణ్ న్ని మద్యలోకి లాగేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఆయనొక్కరే కాదు రాష్ట్రంలో చాలా మంది రాజకీయ నేతలు కూడా పవన్ కళ్యాణ్ న్ని ప్రశ్నిస్తుంటారు. అందుకు కారణం ప్రభుత్వాలను ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ ఆ పని చేయకపోవడమే. రాజకీయాలలో వి. హనుమంత రావుతో పోలిస్తే పవన్ కళ్యాణ్ ఏమీ కాదు. కానీ ఆయన కూడా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలని కోరడం పవన్ కళ్యాణ్ కి ఉన్న అపార ప్రజాధారణ, పలుకుబడికి అది ఒక గుర్తింపుగా కూడా చూడవచ్చు.
పవన్ కళ్యాణ్ తను కుల, మత, బాష, ప్రాంతాలకి అతీతంగా అందరివాడిగా ప్రజలందరి కోసం పనిచేయాలనుకొంటున్నట్లుగా చెప్పారు. కానీ మన దేశ, రాష్ట్ర రాజకీయాలలో అది సాధ్యం కాదని ఆయనకీ తెలుసు. కనుక ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినట్లయితే ఆయన కూడా ఆ చట్రంలోనే ఇమడవలసి ఉంటుంది. ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తారో లేదో ఇంకా తెలియదు కానీ ఇప్పుడు అనాలోచితంగా ఏదో ఒక వర్గానికి మద్దతు ప్రకటించినా, వ్యతిరేకించినా దాని వలన అయన రాజకీయాలలోకి రాకమునుపే కొత్త శత్రువులను, మిత్రులను సృష్టించుకొన్నట్లవుతుంది. పైగా ‘అందరివాడు’ అనే ఆయన ఇమేజ్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఇక ప్రధాని నరేంద్ర మోడీతో దేశంలో చాలా మందికి ప్రముఖులకి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. అలాగని వారందరూ ఆ సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకొని ఇటువంటి సమస్యలు చక్కబెట్టాలని ప్రయత్నిస్తే అటువంటివారిని ఆయన ముందే దూరంగా ఉంచే అవకాశాలే ఎక్కువ. అయినా ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సమస్య. అదే ఈ సమస్యను పరిష్కరించాలి. పరిష్కరించే ప్రయత్నం చేస్తోంది కూడా. కనుక మద్యలో పవన్ కళ్యాణ్ రాజ్యాంగేతర శక్తిలాగ కలుగజేసుకొనవసరం లేదు.