ఎంతైనా కాంగ్రెస్ అంటే కాంగ్రెస్సే. ఏదో ఒక అంశాన్ని అడ్డం పెట్టుకుని ఈ పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలకు చూస్తుంటారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఒక వర్గం ఎప్పుడూ గుర్రుగానే ఉంటుందన్న సంగతి తెలిసిందే. పార్టీ బాధ్యతలు ఆయన్నించి తప్పించాలంటూ ఆ వర్గం మాట్లాడుతూ వచ్చింది. త్వరలో పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని ఉత్తమ్ ప్రకటించేశారు కదా. అయినాసరే, ఈ వర్గం ఉత్తమ్ ని ఇంకా ఆయన్నే టార్గెట్ చేసుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో… కాంగ్రెస్ పార్టీలోనూ రెబెల్స్ సమస్య ఉందనీ, నాయకులతో సమీక్షలు నిర్వహించాల్సి ఉందనీ, ఉత్తమ్ వీటిని పట్టించుకోవడం లేదంటూ కొంతమంది నేతలు విమర్శిస్తున్నారు.
అధికార పార్టీ తెరాస వరుస సమీక్షలు నిర్వహిస్తూ, నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఎన్నికలకు సిద్ధమౌతుంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతవరకూ ఒక్క మీటింగూ పెట్టలేదని విమర్శించారు సీనియర్ నేత వీ హన్మంతరావు. ఆయన కేవలం తన జిల్లాకు మాత్రమే పరిమితమౌతున్నారు అన్నారు. ఆయన గాంధీభవన్లో అందరికీ అందుబాటులో ఉండాలనీ, చాలా తగాదాలున్నాయనీ వాటన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత ఆయనే అన్నారు. గాంధీభవన్ కి వస్తేనే రాష్ట్రవ్యాప్తంగా పార్టీలో ఏం జరుగుతోందో అర్థమౌతుందని మరో సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.
పీసీసీ బాధ్యతల నుంచి తప్పుకుంటా అని ప్రకటించిన దగ్గర్నుంచీ ఉత్తమ్ సొంత నియోజక వర్గానికే ఎక్కువగా పరిమితమౌతున్నారు. వాస్తవానికి కొత్త అధ్యక్షుడు వచ్చే వరకూ పార్టీని నడిపించాల్సిన బాధ్యత ఆయనకే ఉంటుంది. కానీ, నాకు గాంధీభవన్ తో పనేముంది అన్నట్టుగా ఆయన తీరూ ఉంటోంది. పార్టీపరంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల బాధ్యతలను ఆయా పరిధిలోని నాయకులకు అప్పగించేశామనీ, ఎన్నికల బాధ్యతలు ఎవరి పరిధిలో వారు చూసుకోవాలనీ, ఇంకా పీసీసీ అధ్యక్షుడి హోదాలో కూర్చుని కొత్తగా చేసేదేం ఉంటుందీ అనేది ఉత్తమ్ అభిప్రాయంగా తెలుస్తోంది. నిజానికి, తనకేం పట్టనట్టు ఉత్తమ్ ఉండటమూ సరైంది కాదు. అదే సమయంలో ఉత్తమ్ పనితీరును విమర్శిస్తున్న సీనియర్లు కూడా బాధ్యత తీసుకుంటే తప్పేముంది? ఇంకా ఉత్తమ్ ని విమర్శించాల్సిన పనేముంది? తమ సత్తా చాటుకునే అవకాశంగా ఈ ఎన్నికల్ని చూడొచ్చు కదా.