తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుంతరావు ఫైర్ మీద ఉన్నారు. కాంగ్రెస్ కమిటీల్లో పదవుల పంపకం విషయంలో తనకు అన్యాయం జరిగిందనేది ఆయన వాదన. అంతకు మించి అయన బాధేమిటంటే.. తనకు సరైన ప్రాముఖ్యం ఇవ్వకుండా.. పార్టీలోనే కొంత మంది నేతలు కుట్ర చేసి.. కేసీఆర్‌కు సహకరిస్తున్నారుట. తనకు ప్రచార కమిటీ పదవి లభిస్తే.. కేసీఆర్‌ను ఓడించడం ఖాయం కాబట్టి… కేసీఆర్‌తో కుమ్మక్కయిన కొంత మంది నేతలు.. తనకు ఆ పదవి దక్కకుండా చేశారట. తనను పక్కన పెట్టడం కంటే చంచల్ గూడ జైలులో పెడితే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రచార కమిటీ చైర్మన్ పదవి వస్తుందన్న ఉద్దేశంతో వాహనం కూడా సిద్ధం చేసుకున్నానని.. ఇప్పుడా ఖర్చు అంతా వృధా అయినట్లు అయన బాధపడుతున్నారు.
19ఏళ్ల కిందట.. 1989లో ప్రచార కమిటీ చైర్మన్‌గా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చానని వి.హనుంతరావు చెప్పుకొస్తున్నారు. తనకు పదవి ఇస్తే కేటీఆర్‌ను ఓడిస్తానని వాళ్ల భయమని వీహెచ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ప్రజల్లో పట్టు ఉందా లేదా.. అన్న సంగతి తర్వాత. పెద్ద నాయకులుగా చెలామణి అయిపోయి… కీలక పదవులన్నీ తమకే కావాలనుకుంటూంటారు. వీరిలో రెండు రకాల నేతలంటారు. ఒకరు తమకే పదవులు రావాలంటారు. మరొకరు.. ఇతరులకు ఎందుకిచ్చారని ప్రశ్నిస్తూ ఉంటారు. అలాంటి వారిలో పొంగులేటి సుధాకర్ రెడ్డి అనే నేత ఉంటారు. ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడైనా గెలిచింది లేదు కానీ.. రేవంత్ రెడ్డికి పదవి ఎందుకిచ్చారంటూ రచ్చ రచ్చ చేసేశారట.
కాంగ్రెస్ పార్టీకి ఉన్న మైనస్ అదే. ప్రజల్లో పట్టు.. కేసీఆర్ ను ఢీకొట్టే నేతను… ముందుకు తీసుకొచ్చి నిలబెట్టలేరు. గత ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి.. నాలుగో స్థానంలో నిలిచి డిపాజిట్ కూడా పోగొట్టుకున్న .. వి.హనుంతరావు… ఇప్పుడు ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఇవ్వలేదని రచ్చ చేస్తున్నారంటేనే.. ఆ పార్టీ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ లో ఈ అంతర్గత ప్రజాస్వామ్యం… కొనసాగినన్నాళ్లూ… వాళ్లతో వాళ్లు పోరాటం చేసుకోవాల్సిందే కానీ.. ప్రత్యర్థులతో పోరాడే పరిస్థితి రాదనే సెటైర్లు పక్క పార్టీల నేతల నుంచి పడిపోతూనే ఉంటాయి.