రాజ్యసభ ఎన్నికల బరిలో నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంత రావు తప్పుకొన్నారు. ఆయన పదవీ కాలం వచ్చే నెల 21తో ముగుస్తుంది. కనుక ఆయన మళ్ళీ పోటీ చేయాలనుకొన్నారు. ఈరోజు హైదరాబాద్ లో సమావేశం అయిన పార్టీ శాసనసభా పక్షం దానిపై లోతుగా చర్చించిన తరువాత ఆయనను గెలిపించుకోనేంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం పార్టీకి లేదు కనుక పోటీ చేసి ఓడిపోవడం కంటే పోటీ చేయకుండా ఉండటమే మంచిదని నిర్ణయించి ఆయన ప్రతిపాదనను తిరస్కరించింది. కనుక తెరాస అభ్యర్ధులుగా నిలబడిన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంత రావుల ఎన్నిక ఏకగ్రీవం కాబోతోంది. ఒకవేళ పార్టీ అనుమతిస్తే, వి.హనుమంత రావు ప్రతిపక్ష పార్టీలతో బాటు తెరాస మద్దతు కూడా కూడగట్టాలని భావించారు కానీ ఇప్పుడు ఆ అవసరమే లేదు. ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుండటంతో హనుమంత రావుకి మళ్ళీ ఇంత త్వరలో ఎటువంటి పదవులు, అధికారం పొందే అవకాశం కనబడటం లేదు కనుక ఇంక రాజకీయాల నుంచి రిటైర్ కాకతప్పదేమో?