హైదరాబాద్: పవన్ కళ్యాణ్ ఆదివారంనాడు అమరావతి ప్రాంతానికి వెళ్ళి రైతులతో సమావేశమవటంపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ వి.హనుమంతరావు తెగ సంతోషపడిపోతున్నారు. పవన్ ప్రజలలోకి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకోవటం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. నాయకుడు అన్నవాడు ప్రజలలో తిరగాలని, ప్రజల ఇబ్బందులపై స్పందించినవాడే నిజమైన నాయకుడు అని కొనియాడారు. ప్రజల సమస్యలపై పవన్ నిత్యం ఇలాగే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని చాలా అవసరమని, అయితే ఏపీ ప్రభుత్వం దారుణంగా రైతుల భూములు లాక్కుంటోందని విమర్శించారు. రైతుల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా ముఖ్యమంత్రి బలవంతంగా భూములను లాక్కోవటం ఏమాత్రం మంచిదికాదని అన్నారు. పవనేమో జనసేన పార్టీ అధినేత, తెలుగుదేశం, భారతీయజనతా పార్టీలకు మిత్రపక్ష నేత. వీహెచ్ కాంగ్రెస్ నాయకుడు. మరి పవన్‌పై వీహెచ్‌కు ఈ ప్రేమ ఎందుకో అర్థం కావటంలేదు. ఇంతకుముందుకూడా ఓటుకు నోటు కేసులో పవన్ స్పందించటంలేదని, ఆయన స్పందించకపోతే ఇంటిముందు ధర్నాకు దిగుతానని వార్నింగ్ ఇచ్చారు. రెండురోజుల క్రితం పవన్ అమరావతి వెళ్ళి రైతులను కలుసుకోవాలని డిమాండ్ చేశారు. పరోక్షంగా వీహెచ్ పవన్‌కు దిశానిర్దేశం చేస్తున్నట్లుగా ఉంది ఈ వ్యవహారం. గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన వీహెచ్ ఒకవేళ పవన్‌కు వీరాభిమానేమో!