ఆంధ్రప్రదేశ్లో ధాన్యం రైతుల కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రంగంలోకి దిగారు. రైతులకు రూ. రెండు వేల కోట్ల వరకూ బకాయిలు ఉండటంతో.. వారంతా.. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆ విషయం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. చాలా రోజుల నుంచే.. రైతులు ఆందోళన చెందుతున్నట్లుగా వార్తలు వస్తున్నా.. పట్టించుకోలేదు. కొడాలి నాని.. ఓ సారి ఢిల్లీకి వచ్చి… నిధులు విడుదల చేయాలని కోరి వెళ్లారు. కేంద్రం.. ఏ డీటైల్స్ అడిగిందో.. రాష్ట్రం ఏమిచ్చిందో తెలియదు. రైతుల ఆందోళన ఉపరాష్ట్రపతి దృష్టికి రావడంతో.. ఆయన కేంద్ర ఆహార, ప్రజాపంపిణీకి చెందన ఉన్నతాధికారుల్ని పిలిపించి.. వివరాలు తెలుసుకున్నారు. మొత్తం ధాన్యం బకాయిలు ఎంత..? కేంద్రం ఎంత ఇవ్వాలి..? రాష్ట్రం ఎందుకు ఇవ్వడం లేదు..? వంటి అంశాలపై సమీక్ష జరిపారు.
ధాన్యం సేకరణ, చెల్లింపులు పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశమని.. అధికారులు వెంకయ్యనాయుడుకు చెప్పారు. అయితే.. ఉపరాష్ట్రపతికి ఇది తెలియని విషయమేం కాదు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే ఆయన కేంద్ర అధికారులతో.. సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం సేకరించే ధాన్యాన్ని .. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా.. నిబంధనలకు అనుగుణంగా కేంద్రం రాష్ట్రాలకు చెల్లిస్తుంది. ఓ ప్రక్రియ ప్రకారం అది జరుగుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి తన విధివిధానాల్లో కొన్నింటిని మార్చుకుంది. కొన్ని బకాయిలు.. కేంద్రం నుంచి రావాల్సి ఉంది. వీటిపై.. కేంద్రం ఏం వివరణ అడుగుతుందో.. రాష్ట్రం ఏం చెబుతుందో కానీ.. ఒక్క రూపాయి కూడా విడుదల కావడం లేదు.
రైతులకు ఇవ్వాల్సిన రూ. రెండు వేల కోట్ల విషయంలో… వైసీపీ నేతలు వ్యూహాత్మంగా.. కేంద్రం తప్పిదమని.. ప్రచారం చేస్తూండటంతో… బీజేపీ నేతలు అలర్టయినట్లుగా చెబుతున్నారు. కేంద్రం నుంచి ఎలాంటి తప్పిదం లేదని.. మొత్తంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే రైతులకు బకాయిలు చెల్లించడం లేదన్న విషయాన్ని ప్రజల్లోకి పంపడానికే వెంకయ్యనాయుడు సమీక్ష నిర్వహించారన్న అభిప్రాయం కూడా ఉంది. అటు వెంకయ్య నాయుడు సమీక్ష చేస్తున్నారని తెలియగానే.. ఇటు ముఖ్యమంత్రి జగన్.. వ్యవసాయ మంత్రి కన్నబాబును పిలిపించి సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో .. రైతులందరికీ ధాన్యం డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. అక్కడ సమీక్ష ఇక్కడ ఎఫెక్ట్ చూపించిందని అనుకోవచ్చు.