ఉపరాష్ట్రపతి వెంకయ్యనాడు పదవీ కాలం వచ్చే నెలతో ముగుస్తుంది. ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్‌పై చర్చ జరుగుతోంది. కొనసాగింపు లేదని స్పష్టమవుతోంది. దీంతో ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకోవడమేనని చెబుతున్నారు. బీజేపీలో కానీ ప్రభుత్వంలో కానీ ఆయనకు ఎలాంటిపదవులు.. ప్రాధాన్యత ఇవ్వరన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. దీనికి కారణం ఉంది. ఆయన వయసు డెభ్బై మూడేళ్లు. అది బీజేపీ పెట్టుకున్న విధానం ప్రకారం రిటైర్మెంట్ వయసు. ఈ కారణంగానే చాలా మంది సీనియర్లను ఇళ్లకు పరిమితం చేశారు .
కానీ వెంకయ్యనాయుడు రాజకీయ పరంగా మంచి వ్యూహకర్త. బీజేపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా పని చేశారు. పార్టీని నిలబెట్టారు. అయితే ఆయన సేవలు వినియోగించుకోవడం ఇష్టం లేకనే .. కేంద్రంలో కీలక మంత్రిగా ఉన్న సమయంలో ఉపరాష్ట్రపతిగా పంపేశారన్నప్రచారం ఉంది. రాష్ట్రపతిగా ఆయనను ఎన్నుకుంటారన్న ప్రచారం జరిగినా బీజేపీ లైట్ తీసుకుంది. ఇక ఆయనకు ఏ ప్రాధాన్యం దక్కదేమోనని అభిప్రాయానికి రావడానికి ఇవన్నీ ఓ కారణం అంటున్నారు.
నిజానికి వయసే సమస్య అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీ వయసూ కూడా 72 ఏళ్లు. వెంకయ్యనాయుడు కన్నా ఆయన ఒకటి, రెండేళ్లు మాత్రమే చిన్న. మరి ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారా అని కొన్ని సందేహాలు ఉన్నాయి. అయితే రూల్స్ అమలు చేసేవాళ్లకు రూల్స్ వర్కవుట్ కావన్న రూల్ బీజేపీలోనూ ఉంటుందని చెబుతున్నారు. సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేందుకు ఆ రూల్ తెచ్చారని కూడా గుసగుసలున్నాయి. ఎలా చూసినా.. బీజేపీ ఉత్థానంలో అత్యంత కీలక పాత్ర పోషించిన సీనియర్లలో చివరి నేత వెంకయ్య కూడా ఇంటికెళ్లిపోతున్నట్లే !