వైసీపీ ఓడిపోయిన వెంటనే కనిపించకుండా పారిపోయిన సజ్జల భార్గవ్ రెడ్డి విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. ఆయనను తప్పించడానికి జగన్ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరెవరో కాంబినేషన్లు వెదుకుతున్నారు. నాగార్జున యాదవ్ దగ్గర నుంచి తన బంధువు ఎవర్నో తెచ్చి పెట్టాలనుకోవడం వరకూ చాలా ప్లాన్లు వేశారు, అన్నింటికీ సజ్జల కొర్రీలు పెట్టి ఆపేశారు. ఇప్పుడు జగన్ మరో ప్లాన్ తో తెరపైకి వచ్చారు.
సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేయించుకోవాలో బాగా తెలిసిన విడదల రజనీని సోషల్ మీడియా ఇంచార్జ్ గా నియమిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఆయన చర్చిస్తున్నారు. ఈ లీక్ ను పార్టీ వర్గాల్లోకి పంపారు. ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఈ పేరుపై చర్చ జరుగుతోంది. విడదల రజనీ రెడీగా ఉన్నారా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒక వేళ ఆమె ఒప్పుకుంటే చాలా ఖర్చు ఆమె నెత్తిమీదనే వేస్తారు. అందుకే ఆలోచిస్తున్నారు.
మరో వైపు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఎందుకూ పనికి రాడనుకున్న తన కుమారుడ్ని.. ఎలాగైనా వైసీపీ రాజకీయంలో కీలకం చేయాలనుకుంటున్నారు. కానీ వైసీపీ సోషల్ మీడియాను ఆయన నలుగురు సాయంతో చక్రాల కుర్చీలో కూర్చుని నడిపించినట్లుగా నడిపించారు. అదే ఆయనకు మైనస్ అవుతోంది. సజ్జల మాత్రం తన కుమారుడు వీరుడు.. శూరడని చెప్పి.. జగన్ దగ్గర పోస్టు పోకుండా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే విడదల రజనీకి ఇస్తే సజ్జల పెద్దగా అభ్యంతర పెట్టరన్న అభిప్రాయం ఉంది. అందుకే జగన్ ఆ వైపు నుంచి ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.